కరీంనగర్ రూరల్, జూన్ 14 : దేశంలో 7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు తెలిపారు. ప్రీ డయాబెటీస్‌తో వారి సంఖ్య 14 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం కరీంనగర్ మండ లం నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీఎంఈ కార్యక్రమం ‘పంచమ్-2026 డయాబెటీస్ వైద్య శాస్రీయ సదస్సు’ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సదస్సులో ఢిల్లీ, హెదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన వైద్యులు హాజరై డయాబెటిస్‌పై శాస్త్రీయ నూతన విధానాలు, రీసెర్చ్ చేసి న వివరాలు, వచ్చిన సందేహాలను వివరించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ.. డయాబెటీస్‌పై ఆధునిక వైద్య ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు రాష్ట్రం లో మొదటి నుంచి తమ సంస్థ ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యాధిగ్రస్తుల జీవన శైలిలో మార్పులు రావాలని, శారీరక వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని, జంక్‌ఫుడ్, బయట ఆహారం మానేయాలని, మాంసాహారాన్ని తగ్గించడం, రోజూ సరైన సమయంలో 8 గంటల నిద్ర తప్పక ఉండేలా అలవాటు చేసుకోవాలని సూచించారు.
మధుమేహం దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జీ దీప అన్నారు. మధుమేహం ప్రస్తుతం ప్రజారోగ్య సమస్యగా మారిందని, ఐసీఎంఆర్ అధ్యయనాల ప్రకారం దేశంలో డయాబెటీస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిమ వైద్య కళాశాల ఎండీ బోయినపల్లి శ్రీనివాస్‌రావు ఇలాంటి సదస్సులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. సదస్సులో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ పీఎల్ జాన్ ఇజ్రాయిల్, జిల్లా ఆర్గనైజింగ్ చైర్మన్ విజయమోహన్‌రెడ్డి, సీఎల్ ప్రసాద్, రాంచంద్రరావు, రఘురామారెడ్డి, కుమార్, విఠల్, శ్రీదేవి పాల్గొన్నారు.