Husharu 2 | టాలీవుడ్ యువతను ఒక ఊపు ఊపేసిన ఐకానిక్ యూత్‌ఫుల్ ఫ్రాంచైజీ ‘హుషారు’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా, యూత్ కల్చర్‌కు కొత్త అర్ధం చెప్పింది. ఇప్పుడు అదే జోరును కంటిన్యూ చేస్తూ, దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ చూస్తేనే మేకర్స్ ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నారో అర్థమవుతోంది. మొదటి భాగంలో ఐదుగురు స్నేహితులు తయారు చేసిన ‘కబూమ్’ బీరు ఉన్న ట్రక్కును కొందరు బలవంతంగా లాగుతుండగా, వారి మధ్యలో ఒక పెద్ద పాము చిక్కుకుని భయపెడుతున్నట్లుగా డిజైన్ చేశారు. ట్రక్కు కింద తాబేలు, కాస్త దూరంలో బంగారు నగల పెట్టె, వెనుక ఒక ఫ్యాక్టరీ ఉండటం ఈ పోస్టర్‌కు మరింత ఇంటెన్సిటీని తెచ్చాయి. ఇది హిందూ పురాణాల్లోని క్షీర సాగర మథనం (దేవతలు, రాక్షసులు అమృతం కోసం చేసిన మథనం)ను తలపించేలా ఉండటంతో, ఈ కథకు అమృత మథనానికి మధ్య ఉన్న లింక్ ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
మొదటి భాగం అందించిన ఎనర్జీకి మించి, ఈ సీక్వెల్లో డబుల్ ఫన్, నాన్‌స్టాప్ మ్యాడ్‌నెస్‌తో పాటు సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఒరిజినల్ క్రియేటర్ శ్రీహర్ష కొనుగంటి మరోసారి మెగాఫోన్ పట్టుకుని ఆధునిక సంబంధాలు, కాలేజీ కుర్రాళ్ల అల్లరిని మరింత వినూత్నంగా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కొచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు, భగవాన్ తివారి, జతిన్ గోసామి, రజయ్ రోవన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. కేవ్‌మ్యాన్ స్టోరీస్, హెచ్‌కె ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. రాహుల్ వర్మ, కె.వీణా రాణి, కె.హనుమంత్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, కోమటిరెడ్డి శరణ్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. సినిమాకి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందిస్తుండగా, రామ్ మిర్యాల అడిషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. జి.శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ, విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని పంచేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్, ఈ ఏడాది చివరి నాటికి సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.