సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎస్ఎన్డీపీ విభాగం ఇంజినీర్లు, జోనల్ కమిషనర్లతో ఎస్ఎన్డీపీ పనులను ప్యాకేజీల వారీగా సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షించారు.
15 ప్యాకేజీల్లో 52 చోట్ల పనులకుగానూ జీహెచ్ఎంసీ పరిధిలో 33, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చేపడుతున్న 19 పనులపై ఇంజినీర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్‌కు వివరించారు.ఆయా పనుల పురోగతిని ఇకపై ప్రతి మంగళవారం సమీక్షిస్తానని చెప్పారు. జోనల్ కమిషనర్లు కూడా అన్ని నాలాల పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో నాలాల విస్తరణ 100 శాతం పూర్తి కావాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
గతేడాది ఎస్ఎన్డీపీ కింద రూ. 858 కోట్ల పనులకుగానూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే బాండ్ల జారీ, బ్యాంకు రుణాల ద్వారా రూ. 3వేల కోట్ల మేర అప్పులు చేశారు. ఎస్ఆర్డీపీ రూపంలో అధికారులు మరోమారు బ్యాంకు రుణానికి వెళ్తున్నారు. ఈ మేరకు ఆర్థిక విభాగం అధికారులు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు.
పనులు అత్యంత పారదర్శకంగా నాణ్యతగా ఉండేలా చర్యలపై ప్రధాన దృష్టి సారించారు. ఈ మేరకు థర్ట్పార్టీగా పేరొందిన యూనివర్శిటీల ద్వారా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయనున్నారు. ఎస్ఎన్డీపీ పనులకు కూడా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలకు థర్డ్పార్టీలవసరమని టెండర్లు పిలిచారు. మొత్తం 15 ప్యాకేజీల పనుల నాణ్యతను టెండర్ల ద్వారా ఎంపికయ్యే సంస్థలు పరిశీలించాల్సి ఉంటుంది. ఆరు రకాలైన పద్ధతుల ద్వారా నాణ్యతను నిర్ధారించడంతోపాటు పనులు జరుగుతున్నప్పుడే లోపాలు గుర్తించి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.