
కొవిడ్ నిబంధనలతో బ్యాలెట్ బాక్సు విధానంలో మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం (నేడు) ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల వద్ద మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య సిబ్బందిని యంత్రాంగం అందుబాటులో ఉంచింది. ఒక్కో కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. గురువారం మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి హరీశ్ ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందించారు. బ్యాలెట్ బ్యాక్సులతో పాటు ఎన్నికల సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
మెదక్, డిసెంబర్ 9 : మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు(శుక్రవారం) రోజున పోలింగ్ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గురువారం ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రితో సిబ్బంది గురువారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1026 మంది ఓటర్లు ఈ ఎన్నికలో ఓటు వేయనున్నారు. ఇందులో 454మంది పురుషులు, 572 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 13 మంది ఎక్స్అఫీషియోలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. కాగా, ఎన్నికల ప్రక్రియలో 75మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. ఇప్పటికే ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను సీసీ కెమెరాలు, వీడియో ద్వారా రికార్డు చేయనున్నారు.
463 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనుండగా, 463 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే..
శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 75 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్‌లో విధులు నిర్వహించనున్నారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సిబ్బంది అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు 10 మందికి గాను ఒకరు రిజర్వుడ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 12 మంది వీరిలో ముగ్గురు రిజర్వు, మైక్రో అబ్జర్వర్స్ 9 మంది, ప్రిసైడింగ్ అధికారులు 11మంది వీరిలో ఇద్దరు రిజర్వ్‌లో ఉన్నారు.
పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బ్యాక్సులతోపాటు ఎన్నికల సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు.