Shah Rukh Khan | ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్య సాహసాలను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొనియాడారు. దుబాయ్ నుండి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో 27 మంది పిల్లలతో సహా మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానంలో జరిగిన ఒక ఘటనలో కో-పైలట్ దాడికి పాల్పడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యంలో ఆయన చూపిన తెగువను షారుఖ్ ఖాన్ ధైర్యం, బాధ్యతకు నిజమైన నిదర్శనం అంటూ కొనియాడారు. అనంతరం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విమాన ప్రయాణంలో అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులలో ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన మచ్ఛర్‌ను ఎస్ఆర్కే ప్రత్యేకంగా అభినందించారు.
షారుఖ్‌తో పాటు ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కూడా పైలట్ సాహసాన్ని ప్రశంసించారు. వీరితో పాటు రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, సన్నీ డియోల్ మరియు తమన్నా భాటియా వంటి ప్రముఖులు కూడా మచ్ఛర్ చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 బుధవారం నాడు అత్యవసర సంకేతాలను పంపింది. కో-పైలట్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, విమానాన్ని కూల్చేయాలన్న ప్రయత్నాన్ని మచ్ఛర్ అడ్డుకున్నారు. 34,000 అడుగుల ఎత్తు నుండి విమానం ఒక్కసారిగా 17,000 అడుగులకు పైగా పడిపోయినప్పటికీ, ఆయన దానిని సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దేల్ అజీజ్ విమానాశ్రయానికి సురక్షితంగా మళ్లించారు.