ఓదెల, సెప్టెంబర్ 3 : ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల సుమన్రెడ్డికి చిన్నప్పటి నుంచే సేద్యమంటే మక్కువ. సాధారణ రైతుల్లా కాకుండా తనకున్న 15 ఎకరాల్లో వరి, పత్తి, పెసర, పసుపు, బొప్పాయి, మిరప లాంటి పంటలు వేసేవాడు. అయితే సర్కారు పిలుపుతో వినూత్నంగా చేపల పెంపకంవైపు మళ్లాడు. గత ఫిబ్రవరిలో తన ఏడు ఎకరాల భూమిలో 20లక్షలు ఖర్చు చేసి నాలుగు చేపల చెరువులు నిర్మించాడు. అప్పుడే 4లక్షల విలువైన మూడు రకాలైన రవ్వు, కట్ల(బొచ్చ), గడ్డి చేపలు (గ్యాస్ కట్) చేప పిల్లలను పోశాడు. నీటిని శుభ్రంగా ఉంచడంలో భాగంగా నీటిని క్రమం తప్పకుండా మార్చేందుకు మోటర్ల ద్వారా పంపేలా ఏర్పాట్లు చేశాడు. చెరువుల వద్ద ఇద్దరు కాపలాదారులతో పాటు చుట్టూ సీసీ కెమెరాలను అమర్చాడు. కరెంట్ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్‌ను వినియోగిస్తున్నాడు. చేపలను పట్టడానికి రెండు పడవ (బోట్)లను కూడా సిద్ధంగా ఉంచాడు. ఇరువై రోజుల క్రితం చెరువుల్లో పోసుకునేందుకు లక్ష విలువైన చేప పిల్లలను అమ్మాడు. మొదట పోసిన చేపలు ప్రస్తుతం ఒక్కొక్కటి అరకిలోకుపైగా బరువు కాగా, మరో నెల వరకు కేజీకిపైగా వస్తాయని రైతు సుమన్‌రెడ్డి చెబుతున్నాడు. సంప్రదాయ పంటల కంటే మంచి లాభం వస్తుందని, ఎకరానికి మూడుల లక్షల వరకు వచ్చే అవకాశముందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.