
రఫ్ఫాడిస్తున్నారు.. ఆటాడేస్తున్నారు..
రఫ్ఫాడిస్తున్నారు..
అలసట లేకుండా ఉత్సాహంతో విధులు
ఆటలు నేర్పిన పాఠాలతో నేరస్తుల ఆటకట్టిస్తున్నారు..
స్ఫూర్తినిస్తున్న పోలీసు క్రీడాకారులు
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాదు.. టెన్షన్‌ను కూడా దూరం చేస్తుంది. ఆటల్లో విజయాలు మంచి గుర్తింపు ఇస్తాయి. ఉద్యోగ అవకాశాలూ కల్పిస్తాయి..అలా స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన కొందరు.. సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోటీల్లో రాణించడమే కాదు.. అలసట లేకుండా డ్యూటీల్లోనూ సత్తా చాటుతున్నారు. క్రీడలు ఆడటం వల్ల వచ్చిన ఫిట్నెస్తో ఒత్తిడి లేకుండా పనిచేయగలుగుతున్నారు. క్రీడల్లో ఉండే పోటీతత్వం, గెలిచేందుకు వేసే ఎత్తుగడలను విధుల్లోనూ ఉపయోగించి..నేరస్తుల భరతం పడుతున్నారు. ‘పోలీసు’ క్రీడాకారులుగా తమకంటూ..ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్నారు. రెండ్రోజుల కిందట రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన స్పోర్ట్స్ మీట్లోనూ ఉత్తమ ప్రతిభ చూపారు.
చిన్నప్పటి నుంచి..
200, 400 మీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా ఛేదిస్తాను. ఇందుకోసం చిన్నప్పటి నుంచి ప్రాక్టీసు చేశాను. అలా పరిగెత్తుతూ.. జాతీయి స్థాయిలో 16 మెడల్స్‌ను సాధించాను. ఆ మెడల్స్ నన్ను పోలీసుగా నిలబెట్టాయి. రన్నింగ్ కోసం చేసిన శిక్షణ నాలో ఓపికను, ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని పెంచింది. నాకున్న జ్ఞాపక శక్తి ప్రతిభతో ఇప్పుడు రాచకొండ హెడ్‌క్వార్టర్స్ అడ్మిన్ విభాగంలో సమర్థవంతంగా పనిచేస్తున్నా.
క్రీడలంటే చాలా ఇష్టం
నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. మొదట రన్నింగ్ సాధన చేశా. ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్నా. దీంతో మా కుటుంబ సభ్యులు నన్ను హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో వేశారు. అలా జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడటంతో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించా. ఇప్పుడు కూడా పోలీసు విభాగానికి ఫుట్‌బాల్ ఆడుతున్నా.
-ప్రతాప్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, రాచకొండ పోలీసు కమిషనరేట్
ఒత్తిడి లేకుండా విధులు
స్కూల్ వయసులో ఎక్కువ సమయం ఆటలకే పరిమితమవుతున్నానని నా తల్లిదండ్రులు నన్ను స్పోర్ట్స్ స్కూల్లో వేశారు. అక్కడ రన్నింగ్‌లో నంబర్‌వన్‌గా ఉన్నా. ఆ తర్వాత ఆర్చరీ నేర్చుకున్నా.. అలా మొదలైన ఆ ఆట నాకు పోలీసు ఉద్యోగం దక్కేలా చేసింది. ఆర్చరీలో టార్గెట్లోకి బాణం దింపాలంటే చాలా ఓపిక , శ్రద్ధ కావాలి. ఇప్పటికీ పోలీసు విభాగానికి ఆర్చరీలో పతకాలు సాధిస్తూ.. విధులను ఒత్తిడి లేకుండా నిర్వహిస్తున్నా.
-ఆనంద్, కానిస్టేబుల్ , రాచకొండ పోలీసు కమిషనరేట్
స్పోర్ట్స్‌మెన్ అంటే ఓ బ్రాండ్
క్రీడాకారుడు అంటే ఓ బ్రాండ్. ఒక సెలబ్రిటీకి లభించే ప్రత్యేకత స్పోర్ట్స్‌మెన్‌కు దొరుకుతుంది. కబడ్డీ, ఫైరింగ్, రెజ్లింగ్ ఆటల్లో రాణించాను. నాకిప్పుడు పోలీసు విభాగంలో ఓ ప్రత్యేకత ఉంది. డ్యూటీ మీట్లకు వెళ్లినప్పుడు అన్ని రాష్ర్టాల పోలీసు క్రీడాకారులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. క్రీడలు నేర్పిన పాఠాలతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నా.