ముకరంపుర, జూలై 9: ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్లోని టౌన్-2 సబ్ డివిజన్ కార్యాలయంలోపనిచేసే సబ్ ఇంజినీర్ దూత చంద్రశేఖర్‌ను రెండురోజుల క్రితం డిస్మిస్ చేస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు అక్రమంగా అధికారుల లాగిన్లలోకి ప్రవేశించడం, వారి సంతకాలు ఫోర్జరీ చేయడం, సంస్థ నుంచి రూ. 5లక్షలు మంజూరు పొంది డ్రా చేసుకున్న తీరును ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి, విచారణ నివేదిక అధారంగా సదరు అధికారిని డిస్మిస్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్లో కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తెల్లం సునీల్ 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని సొంత రాష్ర్టానికి తీసుకెళ్లిపోయారు. సంస్థ నుంచి పరిహారం పొందాలనే దురుద్దేశంతో సబ్ ఇంజినీర్ చంద్రశేఖర్ తనకు తెలిసిన వ్యక్తి పిల్లి సునీల్ పేరున నకిలీ పత్రాలు సృష్టించాడు.
వీటి ఆధారంగా పరిహారం కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు దరఖాస్తును సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపించేందుకు ఏడీఈతో పాటు డీఈ, ఎస్ఈ, సీఈ లాగిన్లను తెరిచి వారి సంతకాలను ఫోర్జరీ చేసి, దరఖాస్తు ఆమోదం పొందేలా చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు దరఖాస్తును పరిశీలించి రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేశారు.
ఈ చెక్కు మొత్తాన్ని పిల్లి వెంకటేశ్ ఖాతా ద్వారా డ్రా చేసుకున్నారు. కాగా కొద్ది రోజులకే చంద్రశేఖర్ సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారిని కలిసి జరిగిన విషయాన్ని వివరించగా విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదిక ఆధారంగా సబ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌ను డిస్మిస్ చేస్తూ సీఎండీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎస్ఈ ఆర్ రవీందర్ తెలిపారు.
సంస్థలో పూర్తి స్థాయిలో సాంకేతికత ఆధారంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని చంద్రశేఖర్ చనిపోయిన వ్యక్తి పేరున పరిహారం పొందేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేశాడు. ఉన్నతాధికారుల లాగిన్ తెరిచేందుకు కార్యాలయంలో ఇతర ఉద్యోగులకు వీలుండదు. కానీ సాంకేతికత లోపంతో నేరుగా ఏడీఈ నుంచి సీఈ లాగిన్లోకి ప్రవేశించాడు.
ఏ మాత్రం అనుమానం రాకుండా పరిహారం మంజూరు ఫైలును పూర్తి చేశారు. ఓ సబ్ ఇంజినీర్ ఇంతలా తెగించి ఈ తతంగమం తా సాగించిన తీరు ఉన్నతాధికారులను సైతం ఉలిక్కిపడేలా చేసింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. లాగిన్‌ను తెరిచేందుకు సదరు అధికారి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే తప్ప లాగిన్ అయ్యే వీలులేకుండా రక్షణ చర్యలు చేపట్టారు.