హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నుంచి ఏటా రెండుసార్లు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా అధ్యక్షతన ఆదివారం జరిగిన నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్టియం వార్షిక సమావేశంలో నిర్ణయం జరిగినట్టు కన్సార్టియం సెక్రటరీ ప్రొఫెసర్ సుధీర్ కృష్ణస్వామి వెల్లడించారు. దీంతో వచ్చే మే 8న, మళ్లీ డిసెంబర్ 18న ఈ టెస్ట్ జరుగనున్నది. కౌన్సెలింగ్ ఫీజును జనరల్ విద్యార్థులకు రూ.50 వేల నుంచి రూ.30 వేలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్యూఎస్, పీడబ్య్యూడీ విద్యార్థులకు రూ.20 వేలకు తగ్గించారు. సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. కన్సార్టియం అధ్యక్షురాలిగా జోధ్‌పూర్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ పూనమ్ సక్సేనా, వైస్‌ప్రెసిడెంట్‌గా ప్రొఫెసర్ విజేందర్‌కుమార్, క్లాట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ వివేకానందన్ ఎన్నికయ్యారు.