Chiranjeevi | హనుమాన్ జయంతి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీరాముడి పరమభక్తుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసంతో ప్రజలు పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా తమ భక్తిని వ్యక్తపరుస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఆంజనేయస్వామిపై ఉన్న భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచే హనుమంతుడిపై అపారమైన విశ్వాసం కలిగిన ఆయన, తన జీవితంలో ప్రతి విజయానికీ ఆంజనేయుడి ఆశీస్సులే కారణమని ఎన్నోసార్లు వెల్లడించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిరంజీవి, ఆ సందర్భంలో చోటుచేసుకున్న ఓ విశేషాన్ని వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఏడాది కొన్ని నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి తమ ఇంటి పూజామందిరంలోని హనుమంతుడి విగ్రహాన్ని పై నుంచి కింద వరకు తాకే అద్భుత దృశ్యం కనిపిస్తుందని ఆయన తెలిపారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు.అలాగే ఇటీవల అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై సూర్యకాంతి పడిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, కోణార్క్, అరసవిల్లి వంటి దేవాలయాల్లో కూడా ఇలాంటి దైవిక కిరణాలు దర్శనమిస్తాయని చెప్పారు. అలాంటి అనుభూతి తన ఇంట్లోనూ పొందడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
చిరంజీవి తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చదువుకునే రోజుల్లో ప్రతిరోజూ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడినని, జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా హనుమంతుడిని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుందని తన అనుభవాన్ని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు మెగాస్టార్‌కు హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్పందిస్తున్నారు.
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026