అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్కి ‘కాకా’ అనే పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. టైటిల్ విడుదలైన నాటి నుంచి ‘కాకా’ అనే పేరుపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా చిన్నాన్నని ‘కాకా..’ అని పిలవడం రివాజు. ఇందులో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బహుశా అనస్వరకు ఇందులో చిరంజీవి చిన్నాన్న అయ్యుండొచ్చు.. అందుకే ఈ సినిమాకు ‘కాకా’ అని పేరు పెట్టారు అని కూడా చాలామంది అనుకున్నారు.
అయితే.. ఈ వాదనలన్నింటికీ తెరదించుతూ.. ‘కాకా’ అనే పేరు ఈ సినిమాకు పెట్టడంలోని ఆంతర్యాన్ని హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేటు ఈవెంట్లో చిరంజీవి బహిర్గతం చేశారు. ‘కాకా అంటే.. కదిరి కాళిదాస్.. అని అర్థం’ అని చిరంజీవి అసలు విషయం చెప్పేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే దీనిని మేకర్స్ కూడా షేర్ చేయడం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.