శుక్రవారం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ అగ్రహీరో పునీత్‌రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తీసుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి వేలసంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియానికి చేరుకొని పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నీటి నివాళులర్పించారు. తెలుగు అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్, రానా, శ్రీకాంత్, అలీ తదితరులు పునీత్‌రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ను పరామర్శించారు.
‘రాజ్‌కుమార్ కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉంది. శివరాజ్‌కుమార్, పునీత్..మేమంతా అన్నదమ్ముల్ల్లా ఉండేవాళ్లం. ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ అకాలమరణం చూస్తే దేవుడు తీరని అన్యాయం చేశాడనిపిస్తున్నది’ అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టారు. పునీత్‌రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని చూసిన ఎన్టీఆర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ ఎన్టీఆర్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. పునీత్‌రాజ్‌కుమార్ అంత్యక్రియల్ని ఆదివారం నిర్వహించబోతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో అంత్యక్రియలు జరగనున్నాయి.