కాలగణనలో సౌలభ్యం కోసం సంవత్సరాన్ని మాసాలుగా విభజించారు మన పూర్వీకులు. చంద్రుడు పౌర్ణమి నాడు ఉండే నక్షత్రాన్ని ఆధారంగా ఆయా నెలలకు పేర్లు పెట్టారు. పౌర్ణమినాడు మఖ నక్షత్రం పరివ్యాప్తమైన నెలను మాఘ మాసం అని పిలిచారు. శూన్యమాసం అయిన పుష్యం తర్వాత వచ్చే కల్యాణకారక మాసం మాఘం. పుణ్యస్నానాలకు, యజ్ఞయాగాది క్రతువులకు, వివాహాది శుభకార్యాలకు ఈ నెల శ్రేష్ఠమైనదిగా చెబుతారు. యజ్ఞాలకు అధిష్ఠాన దైవమైన ఇంద్రుడికి ‘మఘవుడు’ అన్న పేరు కూడా ఉంది. ఇంద్రాధిపత్యంలో క్రతువులు జరిగే మాసం కాబట్టి ఈ నెలను మాఘంగా పిలుస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘ మాసంలో ఎన్నో పర్వదినాలు పలకరిస్తాయి. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, వసంత పంచమిగా చేసుకుంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి అవతరించింది ఇదే రోజు అని నమ్మకం. చిన్నారుల అక్షరాభ్యాసానికి వసంత పంచమి ప్రశస్తమైన రోజు. ఉత్తర భారతావనిలో దీనిని మదన పంచమిగా వేడుకగా నిర్వహిస్తారు.
చైత్ర మాసంలో ఆగమించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ మన్మథుడు, రతీదేవిని పూజించి, రంగులు చల్లుకుంటారు.
మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా నిర్వహిస్తారు. ఆనాడు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. మాఘశుద్ధ అష్టమినాడు మహాభారత వీరుడు భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు. భీష్మాష్టమి నాడు పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు విడుస్తారు. మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకొంటారు. మాఘ పౌర్ణమిని ‘మహా మాఘి’గా చేసుకుంటారు. ఆరోజు నదీస్నానం విశేష ఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు.
మాఘ బహుళ ఏకాదశిని ‘జయ ఏకాదశి’గా పిలుస్తారు. శ్రీరాముడు లంకా ప్రవేశానికి సముద్రంపై సేతువు ఇదే రోజు ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రి. పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించిన పర్వదినం ఇది. శివరాత్రి సందర్భంగా శివారాధన, ఉపవాస దీక్ష, జాగరణ చేస్తారు. మాఘ అమావాస్య నాడు సముద్ర స్నానం చేయాలని చెబుతారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారంగా అభివర్ణించే మాఘ మాసంలో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. చలి తగ్గుముఖం పడుతుంది. ఎండ తీవ్రత ఇంకా మొదలు కాదు. ఈ కారణంగా మాఘంలో తీర్థయాత్రలు చేస్తుంటారు.