న్యూఢిల్లీ, జూలై 22 : అమెరికా దగ్గర ఎఫ్-35 అనే ఐదో తరం యుద్ధ విమానం ఉంది. చైనా వద్ద దానికి దీటైన సామర్థ్యాలున్న షెన్యాంగ్ జే-35 ఉంది. అదే విధంగా అత్యంత శక్తివంతమైన ఏఐ(కృత్రిమ మేధ) మోడల్‌గా ఇప్పటివరకు అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ మైథోస్ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన కిమీ కే3 కూడా దానికి సమాన స్థాయి సామర్థ్యాలు కలిగిన ఏఐ మోడల్‌గా నిలిచింది. ఇటీవలి వరకు ఏఐ రంగంలో అమెరికా మిగతా ప్రపంచం కంటే కనీసం 6-8 నెలలు ముందంజలో ఉందని భావించేవారు. అయితే గత వారం విడుదలైన కిమీ కే3 ఆ సమీకరణాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది కేవలం సాంకేతిక పరిణామం మాత్రమే కాదు.
ఆర్థిక మార్కెట్ల నుంచి సైనిక సామర్థ్యాల వరకు అనేక రంగాలపై దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారత్ దృష్టిలో చైనా, భారత్ మధ్య శక్తి సమతుల్యాన్ని మార్చగల సామర్థ్యం కిమీ కే3కి ఉందనే అంశం ఆందోళన కలిగిస్తోంది. ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మాన్, ఆంత్రోపిక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డారియో అమోడీ వంటి ప్రముఖుల అభిప్రాయం ప్రకారం మైథోస్ వంటి ఏఐ మోడళ్లు భారీ డాటా విశ్లేషణ, సంక్లిష్ట యుద్ధ ప్రణాళికలు, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు, తయారీ రంగం, సైబర్ దాడులు, రక్షణ వంటి కీలక రంగాల్లో అపూర్వమైన వేగం, తెలివితేటలను అందిస్తాయి. ఈ సామర్థ్యం ఉన్న దేశాలకు వ్యూహాత్మక ఆధిక్యం కూడా లభిస్తుంది. ఇప్పటివరకు ఈ ఆధిక్యం అమెరికా, దాని మిత్రదేశాలకే పరిమితమైంది. ఇప్పుడు కిమీ కే3 రాకతో చైనా కూడా అదే స్థాయికి చేరింది.
మూన్ షాట్ సంస్థ వ్యవస్థాపకుడు యాంగ్ జిలిన్ రూపొందించిన కిమీ కే3 అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్‌గా గుర్తింపు పొందుతున్నది. సాధారణంగా చైనా సాంకేతికతను తక్కువగా అంచనా వేసే సిలికాన్ వ్యాలీ కూడా ఈ మోడల్‌ను ప్రశంసిస్తున్నది. అమెరికా మాజీ ఏఐ సలహాదారు డేవిడ్ సాక్స్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయం. తొలిసారిగా కిమీ కే3 ప్రింట్ అండ్ కోడ్ ఆరేనాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇతర ప్రమాణాల్లో కూడా ప్రపంచ అత్యుత్తమ మోడళ్లకు సమానంగా ప్రదర్శన ఇస్తున్నది. ఇదే సమయంలో అమెరికా ఏఐ పోటీల్లో వెనుకబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది అని ఆయన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత్‌కు ఏఐ పోటీలో అనేక సవాళ్లు ఉన్నాయి. అమెరికాలాగా వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను వేగంగా సమీకరించే సామర్థ్యం లేదు. భారీ ఏఐ మోడళ్లకు అవసరమైన కంప్యూటింగ్ మౌలిక వసతులు కూడా పరిమితంగానే ఉన్నాయి.