బీజింగ్: జననాల రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. 2025లో ఈ రేటు 1949 తర్వాత అతి తక్కువగా నమోదైంది. ఎక్కువ మంది పిల్లలను కనేవిధంగా దంపతులను ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు, పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ, ప్రతి 1,000 మంది జనాభాకు 5.6 మంది పిల్లలు జన్మించారు. పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పాటైన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో జననాల రేటు ఉండటం ఇదే తొలిసారి. నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన డాటా ఈ వివరాలను వెల్లడించింది. జన్మించిన నవజాత శిశువుల సంఖ్య 16 లక్షలు తగ్గి, 79 లక్షలకు చేరింది. 2000వ సంవత్సరం తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. పనిచేసే సామర్థ్యం గల ఉద్యోగ బృందం తగ్గుతుండటం, వృద్ధ జనాభా పెరుగుతుండటం చైనాకు ప్రధాన ముప్పు.