సిటీబ్యూరో, మార్చి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా హైదరాబాద్ మహా నగరంలో పలు దవాఖానలకు సంబంధించి పలు అంశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా నిమ్స్ ఆసుపత్రిలో చిన్న పిల్లల విభాగం ఏర్పాటుతో పాటు 2000 వేల పడకల్ని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ప్రధానంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు బడ్జెట్లో ప్రత్యేకత చూపా రు. 61 మార్చురీలను ఆధునీకరిస్తున్నారు. మరో 94 దవాఖానలను హెచ్ఎండీఏ పరిధిలోకి తెస్తున్నారు. ఇంకా 18 దవాఖానాలలో రోగుల సహాయకులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం మరింత ప్రా ధాన్యం చూపింది. పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక పరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించింది. ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్ కేటాయింపులో పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ వైద్యానికి మరింత సత్తువ పెంచే విధంగా 2022-23 బడ్జెట్లో వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు కేటాయించింది. ఇందులో ప్రధానంగా రోగుల డైట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. టీబీ, క్యాన్సర్ రోగులకు సర్కార్ దవాఖానల్లో అందించే డైట్‌ను మరింత బలవర్ధకంగా అం దించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రస్తుతం వారికి అందిస్తున్న డైట్ చార్జీలను రూ.56 నుంచి రూ.112లకు పెంచిం ది. వీరితో పాటు సాధారణ రోగులకు అందించే డైట్‌ను కూడా మరింత బలంగా అందించేందుకు ప్రస్తుతం అందిస్తున్న డైట్ చార్జీలను రూ.40 నుంచి రూ.80లకు పెంచింది. ఇందుకు ఏటా రూ.43.5 కోట్లను ఖర్చుచేయనుంది.
వైద్య కళాశాల పరిధిలో సేవలందిస్తున్న 18 ప్రధాన దవాఖానల్లో రోగి సహాయకులకు సైతం రెండు పూటలా సబ్సిడీ భోజనం అందించేందుకు ఈ బడ్జెట్లో నిర్ణయించారు. దీని వల్ల ప్రతిరోజు 18,600 మందికి ఈ ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా. ఈ పథకం కోసం ఏడాదికి 38.66 కోట్లు ఖర్చు చేయనున్నారు. గ్రేటర్‌లోని ప్రధాన దవాఖానల్లో ఉస్మానియా, గాం ధీ, నిమ్స్, నిలోఫర్, ఎంఎన్‌జే, ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్, మానసిక రోగుల హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, పేట్ల బుర్జ్ ప్రసూతి హాస్పిటల్, టిమ్స్ ఉన్నాయి. రోగి సహాయకులకు ఇప్పటికే బస చేసేందుకు సత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇక నుంచి దవాఖానల్లోనే సబ్సిడీ భోజనం అందించనుంది.
గ్రేటర్ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ తదితర దవాఖానల్లో మార్చురీలను ఆధునీకరించేందుకు బడ్జెట్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32.50 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది.
పారిశుద్ధ్యం, కార్మికుల వేతనాల పెంపునకు నిర్ణయం
సర్కార్ దవాఖానలో పనిచేసే పారిశుద్ధ్య, ఇతర కార్మికుల వేతనాలను పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం మేర కు ప్రతి బెడ్‌కు రూ.5000ల నుంచి రూ.7500 వరకు పెం చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రతి సంవత్సరం 338 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
బాలింతల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉండటంతో దీనిని నివారించేందుకు కొత్తగా ‘కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్’ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కిట్ ద్వారా మంచి పోషకాహారాన్ని బాలింతలకు అందించనున్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 1.25 లక్షల మంది ప్రయోజనం పొందనున్నట్లు అంచనా.
నగరం నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే గచ్చిబౌలి టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. మరో మూడు హాస్పిటల్స్‌కు సైతం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు.
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో రోజురోజుకు రోగుల రద్దీ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2000 పడకలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్‌లో పడకల సంఖ్య 3489కి పెరగనుంది. ఇందులో భాగంగా చిన్నపిల్లల కోసం నిలోఫర్ తరహాలో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రసూతి బ్లాక్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే గ్రేటర్లో 256 బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించింది.