Supreme Court : అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిమ్స్ ఆస్పత్రి (AIIMS Hospital) వేసిన క్యూరేటివ్ పిటిషన్ (Curative Petition) పై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం.. చట్టాలను సవరించాలని ఆదేశించింది. కాగా అత్యాచార బాధితురాలైన బాలిక తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతించడంపై ఎయిమ్స్ ఆస్పత్రి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ దశలో బాలిక గర్భాన్ని తొలిగిస్తే ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఎయిమ్స్ తన పిటిషన్లో పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరించాలని ఆదేశించింది. ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని ఒక మహిళను మరీ ముఖ్యంగా ఒక బాలికను బలవంతం చేయలేమని ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆపై ఆమె తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిమ్..స్ సుప్రీంలో పిటిషన్ వేసింది. తాము ఎంతో ఆవేదనతో ఈ క్యూరేటివ్ పిటిషన్ను వేస్తున్నామని, ఈ దశలో గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే ఆ మైనర్ తల్లి ఆరోగ్యంపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నది.
అయితే ఇక్కడ ఒక అవకాశం ఉందని, డెలివరీకి ఇంకా నాలుగు వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి, దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలింవచ్చని ప్రతిపాదించింది. ఇదంతా ఆ బాధిత బాలిక క్షేమం కోసమేనని ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. ఇది బాలికపై అత్యాచారం జరిగిన కేసు అని, ఆ ఘటన తాలూకు క్షోభ ఆమెను జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే గర్భవిచ్ఛిత్తిని నిర్వహించాలని చెప్పింది.
గర్బవిచ్ఛిత్తివల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, వారు తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయాలని సూచించింది. అందుకే ఈ విషయంలో నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నామని పేర్కొన్నది. అత్యాచార కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచనలు చేసింది. 20 వారాలు దాటిన తర్వాత కూడా అత్యాచార బాధితులు అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేలా చట్టంలో సవరణ చేయాలని సూచించింది.