– లైబ్రరీ ఆవరణలో అటెండర్ బిందెల తయారీ
– శబ్దాలతో బెంబేలెత్తుతున్న పాఠకులు
చండూరు, డిసెంబర్ 31 : ప్రశాంతతకు, విజ్ఞానానికి నిలయంగా ఉండాల్సిన గ్రంథాలయం కాస్తా ఇత్తడి సామాన్ల తయారీ కేంద్రంగా మారింది. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గ్రంథాలయంలో అటెండర్ చేస్తున్న పనులు ఇప్పుడు పుస్తక ప్రియులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు నరకం చూపిస్తున్నాయి. చండూరు గ్రంథాలయంలో విధులు నిర్వర్తించాల్సిన అటెండర్, తన విధిని పక్కనపెట్టి లైబ్రరీని వర్క్‌షాప్‌గా మార్చుకున్నాడు. గ్రంథాలయ ఆవరణలోనే ఇత్తడి బిందెలు తయారు చేస్తూ, పెద్ద పెద్ద శబ్దాలతో హల్ చల్ చేస్తున్నాడు. పేపర్ చదవడానికి వచ్చే వృద్ధులు, చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ శబ్దాలను భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటెండర్ తీరుపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాఠకులకు అసౌకర్యం కలిగిస్తున్న అటెండర్‌పై జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.