Sanjay Leela Bhansali | టాలీవుడ్ సంచలన దర్శకుడు చందూ మొండేటి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహాకాళ్’ సినిమాకు, ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి కలయికపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు ఆయన తెరదించారు. అయితే, ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీతో తాను కలిసి పనిచేయబోతున్నట్లు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించి అందరిని షాక్‌కి గురిచేశాడు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చందూ మొండేటి మాట్లాడుతూ.. సంజయ్ లీలా భన్సాలీ తనను ప్రత్యేకంగా సంప్రదించారని, ఆయనతో తాను ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. భన్సాలీ స్వయంగా తనకు రెండు వేర్వేరు అద్భుతమైన కథలు వినిపించారని, తన నిర్మాణ సంస్థలో అందులో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని కోరారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చందూ మొండేటి స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఎంతో కసిగా తెరకెక్కిస్తున్న ‘మహాకాళ్’ సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే, బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తదుపరి అడుగులు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక వైపు పాన్-ఇండియా రేంజ్లో ‘మహాకాళ్’ చిత్రంతో పాటు మరోవైపు ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థతో సినిమా చర్చలు జరుగుతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.