Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో రోజు ఎపిసోడ్ కూడా హైడ్రామాతో సాగింది. కంటెస్టెంట్స్ మధ్య గ్రూపులు, అపార్థాలు, భావోద్వేగాలు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ముఖ్యంగా చివర్లో ఊహించని ఎలిమినేషన్ చోటుచేసుకోవడంతో హౌస్మేట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చరణ్ మిడ్‌వీక్ ఎలిమినేట్ కావడంతో సృష్టి తీవ్రంగా బాధపడింది. అనంతరం అమన్, రోహిత్, సృష్టి, షాలిని కలిసి ఝాన్సీ గేమ్ గురించి చర్చించుకున్నారు. ఝాన్సీ తమతో ఉంటే ఇతరులు టార్గెట్ చేసే అవకాశం ఉందని భావించి.. పరిస్థితిని గమనించి మరో గ్రూప్ వైపు వెళ్లిందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. దీంతో ఝాన్సీ ఎవరితో సన్నిహితంగా ఉంటోంది? ఆమె గేమ్ ప్లాన్ ఏంటి? అనే చర్చ హౌస్‌లో మొదలైంది.
మరోవైపు రోహిత్.. త్రిగుణ్ అందరినీ తన మాట వినాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని షాలిని, సృష్టితో చెప్పాడు. త్రిగుణ్ మాత్రం అమన్‌తో మాట్లాడుతూ రోహిత్ లీడర్ కాదని, అగ్రిపరీక్షలో ఒక గేమ్‌లో హైలైట్ అయినంత మాత్రాన అతడిని గొప్ప ఆటగాడిగా చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు కొత్త టాస్క్ ఇచ్చారు. ఏడుగురు సులభమైన టాస్క్ ఆడాలని, ఇద్దరు మాత్రం కష్టమైన టాస్క్‌కు సిద్ధం కావాలని సూచించారు. ఈ క్రమంలో త్రిగుణ్, కృష్ణ, ముఖేశ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అయితే ఇప్పటికే హైరిస్క్‌లో ఉన్న చైత్ర కష్టమైన టాస్క్‌లో పాల్గొనకూడదని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. మిగిలిన వారిలో సుధీర్, వర్షిణిని కష్టమైన టాస్క్‌కు ఎంపిక చేశారు. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్జానీ సులభమైన టాస్క్‌కు వెళ్లారు.
తనను కష్టమైన టాస్క్‌కు ఎంపిక చేయకుండా సులభమైన టాస్క్‌లో ఉంచడంతో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకోవడంతో సుధీర్ ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత రోహిత్, షాలిని కూడా ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడగగా.. తనకు అమ్మ గుర్తొచ్చిందని దేబ్జానీ చెప్పింది. దీంతో రాంప్రసాద్, నరేశ్ ఆమెను నవ్వించేందుకు ప్రయత్నించారు. సులభమైన టాస్క్‌లో భాగంగా ఏడుగురు కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ ‘రన్ రాజా రన్’ టాస్క్ ఇచ్చారు. త్రిగుణ్ ఈ ఆటకు సంచాలకుడిగా వ్యవహరించాడు. రుమాలు పట్టుకుని సర్కిల్ చుట్టూ పరుగెత్తుతూ.. మరో కంటెస్టెంట్ దగ్గర రుమాలు పడేసి అతడి స్థానాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది. రుమాలు పట్టుకున్న వ్యక్తి అవతలి వ్యక్తిని ముందుగా పట్టుకుంటే అతడు ఆట నుంచి బయటకు వెళ్లాలి. లేకపోతే సీటు దక్కించుకున్న వ్యక్తి గెలిచినట్లుగా బిగ్‌బాస్ నియమాలు పెట్టారు.
ఈ గేమ్‌లో ఝాన్సీ, షాలిని, దేబ్జానీ, సృష్టి, అమన్ వరుసగా బయటకు వెళ్లారు. చివరికి రాంప్రసాద్, నరేశ్ మధ్య పోటీ జరిగింది. ఇందులో రాంప్రసాద్ విజయం సాధించి పర్మినెంట్ హౌస్‌మేట్‌గా నిలిచాడు. అయితే అంతటితో టాస్క్ ముగియలేదు. బిగ్‌బాస్ ఒక కంటెస్టెంట్‌ను హైరిస్క్‌లో పెట్టాలని రాంప్రసాద్‌కు చెప్పగా.. అతను అమన్‌ను ఎంపిక చేశాడు. అమన్‌ను రాంప్రసాద్ హైరిస్క్‌లో పెట్టడంపై హౌస్‌లో చర్చ మొదలైంది. చైత్ర.. అమన్‌తో మాట్లాడుతూ రోహిత్ నీకు కాకుండా షాలినికి ఎక్కువగా మద్దతు ఇస్తున్నాడని చెప్పింది. ఎపిసోడ్ చివర్లో అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మహాపరీక్షలో భాగంగా చైత్ర, వర్షిణి, అమన్, సుధీర్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించారు.
నలుగురినీ గార్డెన్ ఏరియాకు పిలిచి.. తమలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఓటు వేయించారు.వర్షిణి చైత్ర పేరును చెప్పింది. అమన్ కూడా చైత్రనే ఎలిమినేట్ చేయాలని ఓటు వేశాడు. సుధీర్ సైతం చైత్ర పేరునే చెప్పాడు. చైత్ర గతంలో టాస్క్‌లో గివ్‌అప్ ఇచ్చిందనే కారణాన్ని అమన్, సుధీర్ ప్రస్తావించారు.మొత్తంగా చైత్రకు మూడు ఓట్లు రావడంతో ఆమెను ఎలిమినేట్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. ఎలిమినేషన్ ప్రకటించిన అనంతరం చైత్ర అందరికీ వీడ్కోలు చెప్పింది. ఆ తర్వాత చరణ్‌ను ఎలిమినేట్ చేసిన విధంగానే చైత్రను కూడా ప్రత్యేకంగా తీసుకెళ్లారు.దీంతో హౌస్‌లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. “నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా?” అంటూ రాంప్రసాద్ సరదాగా వ్యాఖ్యానించాడు.