బంజారాహిల్స్, జూలై 14: తమ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి యత్నించిన సిద్దాపూర్ వాసులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36కు చేరుకున్నారు.
అక్కడి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని వారిని మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా సమావేశమయ్యారని జూబ్లీహిల్స్ ఎస్సై జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదుతో 20 మంది ఆందోళనకారులపై బీఎన్ఎస్ 170 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.