న్యూఢిల్లీ: వాతావరణ మార్పులతో పోరాడగలిగే సరికొత్త పదార్థాన్ని స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)ను శోషించుకోగలదు. బ్లూ-గ్రీన్ ఆల్గే (సయనోబ్యాక్టీరియా)ను ఉపయోగించి దీనిని తయారు చేశారు. నీరు, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్లను ఇది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్, సుగర్స్గా మార్చుతుంది. దీనిని ఏదో ఓ రోజు భవన నిర్మాణంలో ఉపయోగించే అవకాశం ఉంది. ఈ అధ్యయనకర్తల్లో ఒకరైన యిఫాన్ క్యుయి మాట్లాడుతూ, సయనో బ్యాక్టీరియా ప్రపంచంలోని అత్యంత ప్రాచీన జీవ రూపాల్లో ఒకటి అని చెప్పారు. కిరణజన్య సంయోగ క్రియను జరపగలవని, సూర్యరశ్మి, నీరు, సీఓ2ల నుంచి బయోమాస్‌ను ఉత్పత్తి చేయగలవని తెలిపారు. జీవ కణాలకు ఆశ్రయమిచ్చే వాహక పదార్థం హైడ్రోజెల్, అత్యధిక నీటితో క్రాస్-లింక్డ్ పాలిమర్స్‌తో ఈ జెల్‌ను తయారు చేస్తారు. ఈ మెటీరియల్ వాతావరణంలోని సీఓ2ను 400 రోజులపాటు శోషించుకోగలదని పరీక్షల్లో వెల్లడైంది.