‘Cannibal’ CME| న్యూఢిల్లీ: సౌర తుఫానులు భూమిని తాకడం తరచూ జరిగేదే. అయితే పలు సౌర తుఫానుల ఫలితంగా ఏర్పడిన రాకాసి సీఎంఈ (Cannibal CME- కరోనల్ మాస్ ఎజెక్షన్) నేడు భూమిని తాకబోతున్నది. అదే జరిగితే భూ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం పడనున్నది. పవర్గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు దెబ్బతినే ప్రమాదం ఉన్నది.
సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా నుంచి అంతరిక్షంలోకి వెలువడిన మాగ్నటైజ్డ్ ప్లాస్మా, సోలార్ రేడియేషన్ మేఘాన్నే సీఎంఈ అంటారు. ఒక్కోసారి సౌరజ్వాలలు వీటికి జతవుతుంటాయి.
ఒక్కోసారి ఒక సీఎంఈ, దాని వెనుక అత్యంత వేగంగా వస్తున్న మరో సీఎంఈతో కలిసి భారీ సీఎంఈగా ఏర్పడుతుంది. దీనినే రాకాసి సీఎంఈ అంటారు. ఇటీవలి కాలంలో మనం తరచూ సౌర జ్వాలలు, సౌర తుఫానుల గురించి వింటున్నాం. ఇందుకు కారణం ఉంది. సూర్యుడు నిత్యం జ్వలించే అగ్నిగోళం. సూర్యుడిపై మంటలు ఎప్పుడూ ఉండేవే అయినా కొన్నిసార్లు తక్కువగా, మరికొన్ని సార్లు ఉధృతంగా ఉంటాయి. నిద్రాణంగా ఉండే దశను సోలార్ మినిమమ్ అని, మహోజ్వలంగా మండే దశను సోలార్ మ్యాగ్జిమమ్ అని అంటారు. ప్రస్తుతం సూర్యుడు సోలార్ మ్యాగ్జిమమ్ దిశగా వెళ్తున్నాడు. అందుకే సూర్యుడిపై జ్వాలలు ఉద్ధృతంగా ఉన్నాయి.
ఈ సీఎంఈలు భూమిని తాకినప్పుడు జియోమ్యాగ్నెటిక్ తుఫానులను సృష్టిస్తాయి. ఇవి భూ అయస్కాంత క్షేత్రంలో అలజడులకు కారణమవుతాయి. పవర్గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్స్, శాటిలైట్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నది.
ఈ నెల 14న ఏఆర్3370గా పిలిచే సన్‌స్పాట్ నుంచి ఓ సీఎంఈ ఏర్పడింది. ఈ నెల 15న ఏఆర్3363 అనే సన్‌స్పాట్ నుంచి మరో సీఎంఈ వెలువడింది. రెండో సీఎంఈ మొదటి సీఎంతో జతకలవడంతో భారీ సీఎంఈ ఏర్పడింది. అయితే దీనితో పెద్దగా హాని ఏమీ జరుగదని శాస్త్రవేత్తలు తెలిపారు. (సూర్యగోళమంతా మంటలు ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మరింత ఉద్ధృతంగా ఉంటాయి. వాటినే సన్‌స్పాట్స్ అంటారు. ఇవి మచ్చల్లాగా కనిపిస్తాయి)
పేలుడు శక్తిని బట్టి సౌర జ్వాలలను ఏ, బీ, సీ, ఎం, ఎక్స్ అనే తరగతులుగా వర్గీకరించారు. జూన్ 14, 15న ఏర్పడిన రెండు సీఎంఈలూ సీ-తరగతికి చెందిన సౌర జ్వాలలే. విడివిడిగా ఈ సీఎంఈలు జియోమాగ్నెటిక్ తుఫానును కలుగజేసేంత శక్తివంతమైనవి కావు. అయితే రెండూ కలిసినప్పుడు జియోమాగ్నెటిక్ తుఫానును కలుగజేస్తాయి.
2021 నవంబర్‌లో రాకాసి సీఎంఈ భూమిని తాకింది. జియోమాగ్నెటిక్ తుఫానును కలుగజేసింది. అలాగే 2022 మార్చి, ఆగస్టులోనూ భారీ సీఎంఈలు భూమిని తాకాయి. 2024లో సూర్యుడు సోలార్ మ్యాగ్జిమమ్ దశకు చేరుకుంటాడు. సోలార్ మ్యాగ్జిమమ్ దశలో ఎక్కువగా రాకాసి సీఎంఈలు ఏర్పడుతుంటాయి.