ఆత్మగౌరవ భవనాలపై పెత్తనాన్ని ఒప్పుకోం
కేసీఆర్ పాలనలో మంజూరైన బీసీల ఆత్మగౌరవ భవనాలను కాంగ్రెస్ సర్కార్ బందీఖానాలుగా మార్చే కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు.
- జీవో14 రద్దు చేయాల్సిందే.. లేదంటే సర్కార్ పతనమే
- బీసీల కోసం బీఆర్ఎస్ మరో పోరాటం : వీ శ్రీనివాస్‌గౌడ్
- నేడు రౌండ్‌టేబుల్ సమావేశం
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ పాలనలో మంజూరైన బీసీల ఆత్మగౌరవ భవనాలను కాంగ్రెస్ సర్కార్ బందీఖానాలుగా మార్చే కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే జీవో 14 జారీ చేసిందని దుయ్యబట్టారు. ‘సొత్తు బీసీలదైతే పెత్తనం ప్రభుత్వానిదా?’ అని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కులసంఘాలకు కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున రూ.4 వేల కోట్ల విలువైన స్థలాలిచ్చి, రూ.97 కోట్ల నిధులిచ్చి నాడు ఆత్మగౌరవం నిలబెట్టారని కొనియాడారు.
గద్దెనెక్కి మూడేైండ్లెనా ఆ భవనాల నిర్మాణానికి నిధులే ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రూ.కోటి ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన ట్రస్ట్‌లను రద్దుచేయాలని నిర్ణయించి రాత్రికి రాత్రి జీవో 14 జారీ చేయడం దుర్మార్గమని ఖండించారు. బీసీలపై సీఎం రేవంత్‌రెడ్డి పెత్తనం చెలాయిస్తుంటే.. బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బీసీలకిచ్చిన ఆత్మగౌరవ భవనాలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు.
ధరలు పెరిగిన ఆ భూములను రేవంత్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అమ్ముకొనేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో జీవో 14ను రద్దుచే చేయాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ పతనమేనని హెచ్చరించారు. ఆ జీవోను రద్దుచేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. జీవో 14పై శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
బీసీలంటే రేవంత్‌కు చిన్నచూపు: బడుగుల
సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపేనని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు. బలహీనవర్గాలను నాడు కేసీఆర్ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతస్థాయిలో నిలిపారని కొనియాడారు. కానీ ఓట్ల కోసం అలవిగానీ హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి మూడేైండ్లెనా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నంపెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో రేవంత్ దిట్టని తూర్పారబట్టారు. ఆత్మగౌరవ భవనాలను గుంజుకొనేందుకు యత్నించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీసీలకిచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీలతో పెట్టుకొంటే పతనమే: జైపాల్‌యాదవ్
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు ఘోరీ కట్టి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వంచించదని నిప్పులుచెరిగారు. ఇప్పుడు ఆత్మగౌరవ భవనాలపై పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. జీవో 14 రద్దు చేయకుంటే బలహీనవర్గాల ఆగ్రహ జ్వాలల్లో సర్కార్ పతనం తప్పదని హెచ్చరించారు.
కేసీఆర్‌తోనే బీసీలకు న్యాయం: గంగాధర్
కేసీఆర్ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ పేర్కొన్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. మూడేండ్లలో బీసీల కోసం చేసిన మంచి పని ఒక్కటైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. తక్షణమే జీవో14ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
కమిటీల పేరిట కుట్రలు: అంజయ్యయాదవ్
ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరిట కుట్ర లు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హైదరాబాద్‌లో బీసీలకు కేటాయించిన స్థలాలను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. బీసీలందరూ ఏకమై సర్కార్ కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BCCooperation
- BRS
- GO14
- Srinivasgoud
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

