Hanumakonda | హనుమకొండ చౌరస్తా: వరంగల్ ఇన్నర్ వీల్ క్లబ్ (Inner wheel) ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లా పాఠశాల స్థాయి బాలల నాటిక పోటీలను నిర్వహించనున్నట్టు క్లబ్ ఫౌండర్ నేరెళ్ల శోభావతి, కన్వీనర్ మర్రి రేణుక తెలిపారు. వారు గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను, నటనా కళను వెలికితీసి ప్రోత్సహించి, బాధ్యతాయుతమైన సమాజహితులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు.
హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ (ఆశ్రమ/గురుకుల) పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. నాటికలో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా అదే పాఠశాలకు చెందిన వారై ఉండాలి. ప్రతి నాటిక వ్యవధి 30 నుంచి 45 నిమిషాల మధ్య ఉండాలి. ముందుగా పాఠశాల యాజమాన్యా (School Management)ల ఆధ్వర్యంలో విద్యార్థులతో నాటికలను సిద్ధం చేయించాలి. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ న్యాయ నిర్ణేతల బృందం పాఠశాలలను నేరుగా సందర్శించి, నాటికల నాణ్యతను పరిశీలించి తుది పోటీలకు ఎంపిక చేస్తుంది.
సమాజంలో చైతన్యం రగిలించే ఆలోచనాత్మక కథాంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. కుల వివక్ష నిర్మూలన, మూఢనమ్మకాలు, నరబలుల వ్యతిరేక ప్రచారం, ఈవ్‌టీజింగ్/ అమ్మాయిలపై జరుగుతున్న వేధింపుల నివారణ, కలుషిత ఆహారం-ఆరోగ్య భద్రత ఇతర సామాజిక సంక్షేమ, చైతన్యవంతమైన అంశాల ఆధారంగా నాటికలు ఉండాలి.
ప్రథమ బహుమతి రూ. 10,000, షీల్డ్, ప్రశంసాపత్రం, ద్వితీయ బహుమతి రూ. 8,000, షీల్డ్, ప్రశంసాపత్రం ఇస్తారు. ప్రదర్శించిన ప్రతి నాటికకు ప్రదర్శన పారితోషికంగా రూ. 5,000 చొప్పున ప్రోత్సాహక బహుమతి, ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక జ్ఞాపికలు (Mementos), ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
రిజిస్ట్రేషన్, ఎంట్రీల దాఖలుకు చివరితేదీ ఆగస్టు 30. అక్టోబర్ 15 నుంచి 30 వరకు పరిశీలిస్తారు. పోటీలు నవంబర్ 12, 13, 14 తేదీల్లో హనుమకొండలోని నేరేళ్ల వేణు మాధవ్ కళాప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇతర వివరాలకు 8897552958, 8897552958, 9963338116, 9985549900, 9866253646, 9030972224 నంబర్లకు ఫోన్ చేయాలి. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ సుమతి నాయుడు, సభ్యులు వీ లక్ష్మీ కాంతారావు, టీ లక్ష్మణరావు, నాగేశ్వరరావు, కే లలిత, ఎం లావణ్య ఎం రేణుక పాల్గొన్నారు.