న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) లాభాల్లో రెండింతల వృద్ధి నమోదైంది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన రెండింతలు అధికమై రూ.355 కోట్లకు చేరుకున్నది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, ప్రొవిజనింగ్ కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది.
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికిగాను రూ.165.23 కోట్ల లాభాన్ని గడించింది. కానీ, సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం మాత్రం రూ.4,334. 98 కోట్ల నుంచి రూ.3,948.48 కోట్లకు పడిపోయినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.15,672.17 కోట్ల ఆదాయంపై రూ.1,151.64 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి కేవలం రూ.365.38 కోట్లు కేటాయించింది. అంతక్రితం ఏడాది కేటాయించిన రూ.1,341.26 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గినట్లు పేర్కొంది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.23 శాతం నుంచి 3.94 శాతానికి, నికర ఎన్పీఏ 2.48 శాతం నుంచి 0.97 శాతానికి తగ్గినట్లు తెలిపింది. విలువ పరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ.7,779.68 కోట్ల నుంచి రూ.5,327.21 కోట్లకు, నికర ఎన్పీఏ రూ.2,544.32 కోట్ల నుంచి రూ.1,276.57 కోట్లకు తగ్గాయి.