అమెరికా షేర్లలో నేరుగా ట్రేడింగ్ చేసే అవకాశం వచ్చింది. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ (ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ) దీన్ని కల్పిస్తున్నది. ముందుగా గూగుల్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్, టెస్లా, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ లాంటి అధిక లిక్విడిటీ షేర్లలో మాత్రమే ట్రేడింగ్‌ను అనుమతించారు. తర్వాత మరికొన్ని షేర్లలో కూడా ట్రేడింగ్‌ను అనుమతించనున్నారు. గ్లోబల్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్లకుగాను ఎన్ఎస్ఈ డిపాజిటరీ రిసిప్ట్స్‌ను ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ ఇవ్వనుంది. అయితే విదేశీ షేర్లలో మదుపు చేసే పరిమితులను పెంచనందున మ్యూచువల్ ఫండ్లు ఆ షేర్లలో మదుపు చేయలేకపోతున్నాయి. కాగా, ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలను డైవర్సిఫికేషన్ చేసుకునేందుకు ఎన్ఎస్ఈ కొత్తగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. అయితే ఈ సదుపాయం అందరికీ సూటబుల్‌గా ఉంటుందా? విదేశీ షేర్లలో మదుపు చేయడానికి ఎలా? అనే అంశాలను చూద్దాం.
అమెరికా కంపెనీల షేర్లు కొనుగోలు చేస్తే షేర్లకు బదులుగా డిపాజిటరీ రిసీట్స్ (డీఆర్)ను ఇస్తారు. ఈ డీఆర్లు ఇన్వెస్టర్ డీమ్యాట్ అకౌంట్లలో జమ అవుతాయి. ఒకవేళ ఆ కంపెనీలు డివిడెండ్లు, బోనస్‌లు అలాంటివి ఏవైనా ప్రకటిస్తే అవీ మీ ఖాతాలోనే జమవుతాయి. అయితే ఇన్వెస్టర్లకు ఎలాంటి ఓటింగ్ హక్కులు ఉండవు. ఐఎఫ్ఎస్సీ అథారిటి ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీని నియంత్రిస్తుంది. డిపాజిటరీ రిసీట్స్ ఇన్వెస్టర్ పేరు మీదనే ఉంటాయి. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ క్లియరింగ్ కార్పోరేషన్ సెటిల్మెంట్ గ్యారంటీని ఇస్తుంది.
ఒక్కో డీఆర్‌లో 5 నుంచి 15 డాలర్ల వరకు మదుపు చేసే వీలును కల్పిస్తున్నారు. కనీసంగా ఒక డీఆర్ విలువ దాదాపు రూ.375గా ఉంటుంది. ఒక డీఆర్ ఒరిజినల్ షేరులో కొంత భాగం మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం షేరు విలువను కాకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే కొనుగోలు చేసే వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు యాపిల్ షేర్ ధర 166 డాలర్లు. అంటే రూ.12,500 సమానం. ఇది 200 డీఆర్‌లకు సమానంగా ఉంటుంది. కనీసంగా ఐదు డీఆర్‌లను కొనుగోలు చేయవచ్చు. డీఆర్‌లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది.
ఇన్వెస్టర్లు తొలుత డీమ్యాట్ అకౌంట్‌ను గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద రిటైల్ బ్రోకరేజీ సంస్థలు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ కార్యకలాపాలను కూడా ప్రారంభిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎంసీఎక్స్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లు సంయుక్తంగా గిఫ్ట్ సిటీని ప్రమోట్ చేశాయి. వివిధ బ్రోకరేజీ సంస్థలకు గిఫ్టీ సిటీలో సభ్యత్వం ఉందా?.. లేదా?.. పరిశీలించిన తర్వాతే వారికి ఐఎఫ్ఎస్సీలో ట్రేడింగ్‌కు అనుమతిస్తున్నారు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ సభ్యత్వం ఉన్న బ్రోకరేజీలలో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ అకౌంట్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.
అయితే ఈ ఇన్వెస్ట్మెంట్లపై పన్ను ఎలా ఉంటుందన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గిఫ్ట్ సిటీ కూడా స్టాక్ ఎక్సేంజీగా గుర్తింపు పొందినందున ఈ పెట్టుబడులపై కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఇక ఈ కొనుగోళ్లపై సెక్యూరిటీస్ లావాదేవీ పన్ను (ఎస్టీటీ) ఉండదు.