స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలకు దిగారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కోకాపేటలోని నవీన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిలదీశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఎవరు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓఎస్డీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారని పోలీసులు నవీన్ రెడ్డికి తెలిపారు. దాని ప్రకారమే కేసు నమోదైందని.. అందుకే అరెస్టు చేస్తున్నామని వివరించారు. అనంతరం నవీన్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన భార్య లక్ష్మీ అడ్డుపడ్డారు. అక్రమంగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోరారు. అయినప్పటికీ బలవంతంగా అరెస్టు చేస్తుండగా ఆమె స్వయంగా వీడియోలు తీశారు.
బ్రేకింగ్ న్యూస్
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు pic.twitter.com/gsVAyJc1C3
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై నవీన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే చాలు సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రతిపక్షాలను తిడుతున్నారని.. ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. మేం కూడా రేవంత్ రెడ్డిపై చాలానే ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ఇలాంటి అరెస్టులకు భయపడి పోరాటాలు చేయడం ఆపబోమని హెచ్చరించారు. అనంతరం పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్టు చేసి వాహనంలో తరలించారు.