కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిరిసిల్ల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఝూటా మాటలు చెప్పారే తప్ప, ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క హామీ ఇవ్వలేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మండిపడ్డారు. గురువారం వారు సిరిసిల్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఏదైనా జిల్లాకు వస్తున్నారంటే ఆ జిల్లా సమస్యలు పరిష్కరించడానికి హామీలు ఇస్తారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేటీఆర్‌ను తిట్టేందుకే అధికారిక సభ పెట్టినట్టు ఉన్నదని విమర్శించారు.
వచ్చే ఎన్నికల వరకు టీపీసీసీ అధ్యక్షుడిగా తానే ఉంటానని మహేశ్‌గౌడ్ చెప్పడం, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మంత్రిని చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించడం చూస్తే ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మరో ఏడాది కూడా ఉంటారో లేదో తెలియదని, మహేశ్ గౌడ్‌కు వచ్చే ఎన్నికల నాటికి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి ఉంటుందో, ఊడుతుందో తెలియదన్నారు.
సిరిసిల్ల గడ్డపై దళితులపై ప్రేమ ఒలకబోసిన సీఎం.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు పూలమాల వేయలేదో చెప్పాలన్నారు. నేతన్న కాంస్య విగ్రహం, దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని కూడా పట్టించుకోలేదని, అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించలేదని మండిపడ్డారు. సిరిసిల్ల కేటీఆర్ అడ్డా అని, దానిని బద్దలు కొట్టడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. సభకు స్థానికులు రాలేదన్న విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసే ఒప్పుకొన్నారని, ఈ ప్రాంత ప్రజలకు కేటీఆర్‌పై ఉన్న అభిమానానికి ఇదో నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తన భాషతోపాటు వ్యవహార శైలిని మార్చుకొని వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని ఘాటుగా హెచ్చరించారు.
మీకే గ్యారెంటీ లేదు: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘వచ్చే ఎన్నికల వరకు మీ పోస్టులకు గ్యారెంటీ ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆ పోస్టులో ఏడాది కూడా ఉంటారో లేదో తెలియదని, టీపీసీసీ పోస్టు ఎప్పుడు ఊడుతుందో తెలియదన్నారు. ఈ విషయాన్ని విస్మరించి సిరిసిల్ల గడ్డపై గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామంటూ మోసం చేస్తున్నారన్నారు.
‘ముందు నువ్వు కొడంగల్‌లో తిరిగి గెలుస్తావా?’ అంటూ ప్రశ్నించారు. అధికారిక సభ అనే విషయాన్ని మరచిపోయి, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులను అక్రమ ఆస్తులుగా చూపించి కేటీఆర్, కేసీఆర్‌పై విషం కక్కారన్నారు. కేసీఆర్ ఎర్రవెల్లిలో భూములు కొన్ననాడు వాటి విలువ ఎంత ఉండేదో ఓసారి తెలుసుకోవాలని సూచించారు. కేటీఆర్ సిరిసిల్లను ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారని, రాజధానికి దీటుగా ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చారని చెప్పారు. మూడేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కపైసా అయినా కేటాయించారా? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఆకాంక్ష అన్ని జిల్లాల్లో ఉందన్న విషయాన్ని చాటి చెప్పడానికే కేసీఆర్ కరీంనగర్‌ను విడిచిపెట్టి మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్‌కు పోటీచేశారన్నారు.
‘కేసీఆర్ ఎక్కడ పోటీచేసినా ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూశారు. కానీ, కొడంగల్‌లో నిన్ను ఎమ్మెల్యేగా ఒడిస్తే, మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేశావు. అక్కడ ఒక్క ఎమ్మెల్యేనైనా గెలిపించావా?’ అని నిలదీశారు. మధ్య మానేరు ముంపు బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తానని చెప్పి.. సిరిసిల్ల సభలో ఎందుకు ప్రకటించలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 652 కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ పాఠశాలలను మూసివేస్తున్నారని మండిపడ్డారు. 75 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్తున్నవాటిలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? అని నిలదీశారు. చరిత్రలోనే తొలిసారిగా కేసీఆర్ సాగు రంగానికి 24 గంటల కరంటు సరఫరా చేశారని, ఆ విధంగా ఇప్పుడు సరఫరా చేస్తున్నారా? అని సీఎంను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు రేవంత్‌రెడ్డి ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పడంతోపాటు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, కేసీఆర్‌ను సీఎంగా చేసి తీరుతామని స్పష్టం చేశారు.
సిరిసిల్ల గడ్డపై నుంచే కేటీఆర్ సీఎం అవుతారు : రసమయి బాలకిషన్
ఎన్ని రకాల బెదిరింపులకు గురిచేసినా సిరిసిల్ల పట్టణం నుంచి మహిళలు, నేత కార్మికులు సీఎం సభకు వెళ్లలేదని, కేటీఆర్‌పై ప్రజలకున్న అభిమానానికి ఇదో నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సీఎం పర్యటన, మాటలు చూస్తే.. బాహుబలి సినిమాలో కాలకేయుడి పాత్ర గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మంచి ఉద్యోగం విడిచి తెలంగాణ సాధన కోసం వచ్చిన కేటీఆర్‌కు, తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు ఒకరి సొమ్మును దోచుకోవడం, దాచుకోవడం వంటి అలవాట్లు లేవన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం తన అన్నదమ్ములకు భూముల పంపకాలు చేస్తున్నారని మండిపడ్డారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల్లాగా చొరబడ్డారని కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ పుట్టలో పాముగా చొచ్చి, మొత్తం మింగుతున్నది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసినప్పుడు, పదవులకు రాజీనామా చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పాలన్నారు. గడిచిన మూడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ కింద శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. సిరిసిల్ల గడ్డపై నుంచి లక్ష మెజార్టీతో గెలిచి, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు స్పీకర్ గురించి పొరబాటున తప్పుగా మాట్లాడారని, అదే రోజు తన తప్పును ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కానీ అసెంబ్లీలో మాటిమాటికీ దళిత స్పీకర్ అంటూ కులం పేరుతో అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. బతికి ఉన్న వ్యక్తులకు దళిత బిడ్డలెవ్వరూ చావు డప్పులు కొట్టరని, ఎర్రవెల్లిలో కొట్టింది దళిత బిడ్డలు కాదని, వారి డప్పులు తీసుకొని కొంతమంది రెడ్డిలు డప్పులు కొట్టారని, అందుకే ఆ ప్రాంతాన్ని శుద్ధి చేస్తే దానిని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఉరిసిల్లగా మార్చారు : సుంకె రవిశంకర్
సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల జిల్లాను.. సిరులకు నిలయంగా కేటీఆర్, కేసీఆర్ మార్చారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో మళ్లీ ఉరిసిల్లగా మారిందని మండిపడ్డారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో 35 మంది కార్మికులు చనిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ఏమైనా సహాయం ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదన్నారు. సిరిసిల్ల కేటీఆర్ అడ్డా అని, దీనిని ఎవరూ కూల్చలేరని, ఎన్ని కుట్రలు చేసినా తిరిగి కేటీఆర్ లక్ష మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నారు.
సిరిసిల్లకు చేసిందేమీ లేదు : జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లలో ఒక్క అభివృద్ధి పని కూడా జరుగలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నాటి సమైక్య రాష్ట్రంలోనూ అలాగే నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సిరిసిల్లపై నిర్లక్ష్యం ప్రదర్శించారని చెప్పారు. సిరిసిల్ల గడ్డపై సభ పెట్టిన సీఎం మహనీయులకు గౌరవం ఇవ్వకుండా అవమానించారన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఎవరి తరమూ కాదన్నారు. తెలంగాణ ఆస్తులను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
దరిద్రపు పాలన: జిందం చక్రపాణి
కాంగ్రెస్ దరిద్రపు పాలన వల్ల ఇప్పటికే మూడేండ్లలో 35 మంది నేతన్నలు చనిపోయారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లకు వచ్చి నేతన్న కాంస్య విగ్రహానికి పూలమాల వేయనప్పుడే రేవంత్ రెడ్డి నైజం ఏందో బయటపడిందన్నారు. రూ.3,300 కోట్లతో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కేటీఆర్ విశేష కృషి చేశారన్నారు. ప్రతి పనికీ 15 శాతం కమీషన్ తీసుకుంటున్న ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని విమర్శించారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలను మానుకోవాలని సీఎంకు సూచించారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ నాయకులు జీవీ రామకృష్ణారావు, రవీందర్‌సింగ్, హరిశంకర్, రవీందర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్, పొన్నం అనిల్‌గౌడ్, సిద్దం వేణు, నాగరాజు, సంపత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
కబ్జా ఆరోపణలను నిగ్గుతేల్చుతాం: మాజీ ఎంపీ వినోద్‌కుమార్
సిరిసిల్లలో కేటీఆర్ బంధువులు ఎనిమిది వేల ఎకరాలు కబ్జా చేశారని, అందులో 2,400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి, ఆ వివరాలను సిరిసిల్ల సభలో ఎందుకు వెల్లడించలేదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఆధారాలు చూపాలని, కబ్జా చేసిన భూముల వివరాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ మొత్తం డిమాండ్ చేసినా ఎందుకు స్పందించలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, గాలి మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. తాము సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని, నిబంధనల ప్రకారం నెలరోజుల్లో వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీ రికార్డుల నుంచి ముఖ్యమంత్రి మాటలను తొలగించేలా పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ రోడ్ల విస్తరణ కోసం కేంద్రంతో సంప్రదింపులు చేసి డిఫెన్స్ భూములు సాధించినట్టు సీఎం చెప్పుకోవడం పచ్చి అబద్ధమన్నారు.
దీనికి కావాల్సిన చర్యలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చేసమయానికి ప్రభుత్వం మారిందన్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు స్థలంలో అండర్‌పాస్ నిర్మాణానికి అనుమతి వచ్చిందని సీఎం అన్నారని, నిజానికి అది హకీంపేట్ ఎయిర్‌పోర్టు అని చెప్పారు. ముఖ్యమంత్రికి భూముల విషయంలో అవగాహన లేదని చెప్పడానికి ఇవే నిదర్శనమన్నారు. ‘కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటూ ఇన్నాళ్లు ఆరోపణలు చేశారు కదా? ఇప్పడు ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు నింపిన మోటర్లు కాళేశ్వరంలో భాగంగా ఏర్పాటు చేసినవి కావా?’ అని ప్రశ్నించారు. అది కూలేశ్వరమై అయితే నీళ్లు ఎలా ఎత్తిపోస్తున్నారో చెప్పాలన్నారు. వేమువాడ అభివృద్ధి కోసం రూ.90 కోట్లు వెచ్చించి గుడిచెరువుకు 33 ఎకరాల భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? వేములవాడ రింగ్‌రోడ్డు, బద్దిపోచమ్మ గుడులను విస్తరించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే: గంగుల
వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు, విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాకు అనేక వరాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీని ఇవ్వలేదన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతోపాటు, 22ఏ వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకే సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేశామని, 90 శాతం పనులు అప్పుడే పూర్తి అయ్యాయని అన్నారు. దానిని ఇప్పుడు ప్రారంభించి, అంతా వారే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఎన్ని చెప్పినా కలెక్టరేట్ నిర్మాణంలో కేసీఆర్ ముద్రను చెరిపివేయలేరన్నారు. మానేరు రివర్ఫ్రంట్తోపాటు అన్నదాతలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య, కరెంటుకోతల వంటి అంశాలపై సీఎం సమీక్ష చేస్తారని భావించామని, అవేవీ లేకుండానే ముగించారన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌తో ఉన్నా, కరీంనగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులు, డంప్‌యార్డు తరలింపు, టీటీడీ ఆలయం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టి కరీంనగర్ జిల్లాను సిరుల జిల్లాగా మార్చితే, కాంగ్రెస్ మాత్రం మళ్లీ కరువులోకి నెడుతున్నదన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధి తప్ప, కాంగ్రెస్ నయాపైసా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని, పాలనపై పట్టు సాధించాలని సీఎంకు సూచించారు. సిరిసిల్లలో నేత సామాజికవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో గెలిచినవారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పుడు పచ్చి మోసమని విమర్శించారు. క్యాబినెట్లో ఉన్న నేత బిడ్డ కొండా సురేఖను బలవంతంగా తొలగించిన సీఎం మాటలను ఆ సామాజికవర్గం నమ్మబోదని స్పష్టంచేశారు.
అభివృద్ధి చేస్తే 4 వేల మంది పోలీసులెందుకు: పాడి
సిరిసిల్లను బాగా అభివృద్ధి చేస్తే.. నాలుగు వేల మంది పోలీసులను పెట్టుకొని పాదయాత్ర ఎందుకు చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన పదేండ్లలో సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో పది శాతాన్ని, సీఎంగా కొడంగల్‌లో చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. సీఎం పాదయాత్ర చేసిన రోడ్డును కేటీఆర్ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. కరీంనగర్ కలెక్టరేట్ నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయన్నారు. రే హుజూరాబాద్ నియోజకవర్గానికి వెయ్యి కోట్లు ఇస్తారని ఆశించామని, కనీసం సమీక్ష కూడా చేయలేదన్నారు. దళితులపై ప్రేమ ఉంటే దళిత బంధు నిధులు ఎందుకు ఇవ్వడం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.