న్యూఢిల్లీ: బోర్న్‌విటా(Bournvita) డ్రింక్‌పై యూట్యూబర్ రేవంత్ హిమసింగ చేసిన వీడియో వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. బోర్న్‌విటాలో షుగర్ శాతం ఎక్కువగా ఉన్నట్లు ఆ వీడియోలో యూట్యూబర్ ఆరోపించారు. ఆ వీడియోను బోర్న్‌విటా కంపెనీ ఖండించింది. అశాస్త్రీయ పద్ధతిలో వీడియోను పోస్టు చేసినట్లు కంపెనీ పేర్కొన్నది. యూట్యూబర్ పోస్టు చేసిన వీడియోలో వాస్తవాలను వక్రీకరించాడని, తప్పుడు విషయాలను చెప్పినట్లు కంపెనీ ఆరోపించింది.
యూట్యూబర్ రేవంత్ ప్రస్తుతం ఆ వీడియోను డిలీట్ చేశారు. లీగల్ నోటీసులు ఇచ్చిన తర్వాత అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ మోండెలేజ్కు చెందిన బోర్న్‌విటా బ్రాండ్ డ్రింక్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ప్రకటన చేయాల్సి వచ్చింది. గత ఏడు దశాబ్ధాల నుంచి తమ ఉత్పత్తి మార్కెట్లో ఉందని, శాస్త్రీయంగా రూపొందించిన తమ ఉత్పత్తికి ఇండియాలో విశ్వనీయమైన వినియోగదారులు ఉన్నారని, స్థానిక చట్టాలకు కట్టుబడి నాణ్యతతో ఉత్పత్తిని తయారు చేసినట్లు బోర్న్‌విటా తన ప్రకటనలో తెలిపింది.
యూట్యూబర్ చేసిన వీడియో ద్వారా తమ కస్టమర్లు భయాందోళనలకు గురైనట్లు బోర్న్‌విటా తెలిపింది. డిలీట్ అయిన ఆ యూట్యూబర్ వీడియోను దాదాపు కోటి మందికిపైగా వీక్షించారు.