తూర్పు తెల్లవారుతోందనగా, ప్రతి చెట్టు పైనా, ప్రతి కొమ్మ మీదా ఏదో ఓ పిట్ట కొలువుదీరి, కమ్మగా కూతపెడుతుంది! ఆ స్వరసమ్మేళనం సహజ శ్రావ్యంగా ఉంటుంది. ప్రకృతిసిద్ధమైన స్థానిక కాలిక చైతన్యమే ఆ స్వరసమ్మేళనానికి మేళకర్త! కొన్ని స్వరసమ్మేళనాలకు సామాజిక చైతన్యమే సమ్మేళనకర్తగా ఉంటుంది. కొందరు వ్యక్తుల ద్వారా, ఈ చైతన్యం సమాజంలోని అన్ని వర్గాల వారికి-వారివారి పరిమితులకు లోబడి అందుబాటులోకి వస్తూంటుంది. ఇది, నిద్ర నుంచి మెలకువలోకి జరిగే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ప్రభావితులను చేసేవారిని వైతాళికులంటారు.
ఇవాళ మనం ప్రస్తావించుకోబోయే ఒద్దిరాజు సోదరులిద్దరూ- సీతారామచంద్రరావు (1887-1956), ఆయన తమ్ముడు రాఘవరంగారావు (1894- 1973) ఆ కోవకు చెందినవాళ్లే. అయితే, వాళ్లను గురించి ఒక్కముక్కలో తేల్చేయటం అసాధ్యం! మన అధ్యయన పరిధిలోకి ఈ అపూర్వ సహోదరుల్లో ఒక్కరి-సీతారామచంద్రరావు కృషే, లెక్కలోకి వస్తుందన్నమాట నిజమే! ఒద్దిరాజు సోదరులు పుట్టి, పెరిగి, వెలుగులు పంచిన ఊరు ఇనుగుర్తి. 2016 వరకూ వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ పెద్ద గ్రామం తర్వాతి కాలంలో మహబూబాబాద్ జిల్లాలో చేరింది; అన్ని సౌకర్యాలూ ఉన్న పట్టణంగా ఎదిగింది. వెయ్యేండ్ల కిందటే, దక్షిణ భారతదేశంలోని దేవగిరి- వెలనాడు-మధురై రాజ్యాలకు విస్తరించిన కాకతీయుల రాజధాని నగరం ఓరుగల్లు, ఈ గ్రామానికి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది!
ఒద్దిరాజు సోదరుల తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకున్నవారే, చదువు విలువ బాగా తెలిసివున్నవారే. అయినప్పటికీ, వారిద్దర్నీ పాఠశాలకు పంపలేదు. సమర్ధుడైన ఉపాధ్యాయుణ్ణి ఇంటికే పిలిపించి చదువు చెప్పించారు.
కాలుమీద కాలేసుకుని బతకగలిగినపాటి స్థితిమంతులే కానీ, ఈ అపూర్వ సహోదరులు జీవితమంతా కొత్తవిషయాలు నేర్చుకోడానికి పడరానిపాట్లు పడుతూ వచ్చారు. అలా, పడీ పడీ పాలన వ్యవహారాలూ, రెవెన్యూ కార్యకలాపాలూ సాగే ‘అధికార భాష’ ఉర్దూతో సహా స్వయంకృషితోనే పదహారు భాషలు నేర్చుకున్నారు. పెద్దపెద్ద నగరాలకు తమంత తామే వెళ్లి, స్వల్పకాలంలోనే విదేశీభాషల్లో కూడా పట్టాదారులై వచ్చారు. సంగీత సాహిత్యాల్లో అందెవేసిన చేతులనిపించుకున్నారు. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడుతూ ఉండిన ‘సుజాత’ పత్రికలో, ఈ సోదరుల్లో పెద్దవాడు సీతారామచంద్రరావు రాసిన కథలు మూడు 1928-1929 సంవత్సరాల్లో వరసగా అచ్చయ్యాయి.
అచ్చుపుస్తకమే అబ్బురంగా ఉండే కాలంలో పెరిగినప్పటికీ, ఒద్దిరాజు సోదరులు సొంత డబ్బుతో అచ్చుయంత్రం కొనుక్కొచ్చి, ‘అ’ నుంచి ‘క్ష’ వరకూ అచ్చుపని తామే నేర్చుకున్నారు! చేసాయం ఉంటారని, తమ గ్రామంలోని చురుకైన వారికి కంపోజింగ్ పని నేర్పించారీ సోదరులు. గ్రామాలకు పత్రికలను తీసుకొచ్చేవారిపై కన్నెర్రజేసే పెత్తందార్ల నీడలో పెరిగినా స్థానికులకోసం ‘తెనుగు పత్రిక’ను ప్రారంభించిన సాహసులు వాళ్లు. కొద్దోగొప్పో చదువుకున్న వారికి సైతం వైజ్ఞానిక పరిజ్ఞానమే నకుసుమంగా ఉండిన కాలంలో, ఒద్దిరాజు సోదరులు తమంత తామే విజ్ఞాన గ్రంథాలను రచించి-అచ్చువేసి మరీ అందించారు.
వడ్రంగం, కమ్మరం, తాపీ పని, చర్మకార వృత్తులు నేర్చుకుని, ఆయా పనుల్లోనూ నిష్ణాతులు అనిపించుకున్నారు. ఆత్మజ్ఞానంతోనే విజ్ఞానయాత్ర ప్రారంభం కావాలన్న అవగాహనతో, మానవ శరీర నిర్మాణ శాస్త్రంపైనే తొలి గ్రంథాన్ని వెలువరించిన వాళ్లు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి తాము నడుంకట్టడమేకాక, వైద్యం-పశువైద్యం తదితర రంగాల్లో ‘ప్రథమ చికిత్స’ లాంటి కనీస అవసరాలను ఎవరికి వారు తీర్చుకోగలిగేలా సామాన్య జనానికి తర్ఫీదు ఇచ్చినవాళ్లు. అప్పట్లో విపరీత ప్రమాణానికి చేరిన మలేరియాకు అలోపతి వైద్యపరిజ్ఞానం తెలుసుకుని, పనిలో పనిగా హోమియో వైద్యం కూడా నేర్చుకున్నవాళ్లు ఆ అపూర్వసహోదరులు.
ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో తెలంగాణలో మొదలై, దాదాపు నూరేండ్లపాటు సుదీర్ఘంగా సాగిన స్థానిక-కాలిక చైతన్య స్వరసమ్మేళనం గురించిన ప్రస్తావనతో మన అధ్యయనం మొదలైంది. పత్రికాధిపతులు (ఒకప్పుడు ఎడిటర్లను అలానే పిల్చేవారు- ఈ స్వరాభిషేకానికి కండక్టర్ల లాంటివాళ్లు. ఇక, కథానిక రచయితలు ఈ స్వరమేళలో తమ తమ రాగాలు తాము వినిపిస్తూ వచ్చారు. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో భండారు అచ్చమాంబ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మాడపాటి, సురవరం తదితరులతో ఈ కృషి మొదలై, బహుముఖంగా సాగింది. ఒద్దిరాజు, ఎల్లాప్రెగడ, కాళోజీ (నారాయణరావు), వట్టికోట, పొట్లపల్లి, ఇల్లిందల, భాస్కరభట్ల, నెల్లూరి కేశవస్వామి, పి.వి.దాశరథి (కృష్ణమాచార్య), యశోదారెడ్డి, దాశరథి (రంగాచార్య), సదాశివ తొలి, మలి తరాల కథానిక రచయితల్లో ప్రముఖులు. కాగా-‘అంపశయ్య’ నవీన్, అల్లం రాజయ్య, జూకంటి జగన్నాథం, బి.ఎస్. రాములు, పెద్దింటి అశోక్‌కుమార్, జాజుల గౌరి, జూపాక సుభద్రలాంటి ఈ తరం రచయితల వరకూ ఎందరో ఈ కోవకు చెందినవారే! అలాంటి వారందరి గురించి ఈ శీర్షిక కింద చర్చించాలన్న పేరాశ నెరవేరుతుందనే ఆశిద్దాం.
– మందలపర్తి కిషోర్
8179691822