Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బాయిలర్ పేలుడు జరగడంతో ఐదుగురు మరణిచారు. 10 మంది గాయపడ్డారు. ఏపీ, తిరుపతి జిల్లా, సత్యవేడు మండలంలోని శ్రీసిటీలో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో శనివారం బాయిలర్ పేలింది. సెజ్ పరిధిలో ఉన్న టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. పేలుడు కారణంగా.. నైట్ షిఫ్టులో ఉన్న కార్మికులు మృత్యువాత పడ్డారు.
పేలుడు సమయంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 10 మంది గాయపడ్డారు. మృతులను గౌరవ్ రాయ్ (35), చిన్నా మస్తాన్ (36), రమేష్ (40)మోహన్ (20), వాసు (38)గా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసుల, రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చెన్నైలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.
బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని ప్రకటించింది. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించార. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాయిలర్ పేలుడు ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.