(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ కారణంగా ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు. వ్యాధిని నిర్ధారించడంలో జరిగే ఆలస్యం కారణంగానే బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీనికి చెక్ పెడుతూ క్యాన్సర్ మహమ్మారిని రియల్‌టైమ్‌లో సత్వరమే గుర్తించడమే కాకుండా దాని తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసే సరికొత్త రక్త పరీక్షను ఇంగ్లండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రారెడ్ స్కానింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎనాలిసిస్‌తో పనిచేసే ఈ సాంకేతికత సాయంతో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చికిత్సను అందించవచ్చని నిపుణులు తెలిపారు.