న్యూఢిల్లీ, జనవరి 10: అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్.. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) నుంచి పూర్తిగా వైదొలిగింది. తమకున్న 9.2 శాతం వాటాను అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ)కి అమ్మేసింది. భారతీయ రీట్స్‌లో ఏడీఐఏకు ఇదే తొలి లావాదేవీ. కాగా, డీల్ విలువ దాదాపు రూ.1,740 కోట్లు (దాదాపు 240 మిలియన్ డాలర్లు)గా ఉన్నది.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) బల్క్ డీల్ డాటా వివరాల ప్రకారం 5.43 కోట్లకుపైగా యూనిట్లను రూ.320 చొప్పున కొన్నారు. బ్లాక్ ట్రేడ్ మార్గం ద్వారా ఈ లావాదేవీ జరిగింది. కే రహేజా కార్ప్, బ్లాక్‌స్టోన్ కలిసి మైండ్‌స్పేస్ రీట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు 2017 మార్చిలో రహేజా పోర్ట్‌ఫోలియోలో బ్లాక్‌స్టోన్ 15 శాతం మైనారిటీ వాటాను అందిపుచ్చుకున్నది. ఐపీవోలో 100 మిలియన్ డాలర్ల వాటాను అమ్మేయగా, మిగిలిన వాటాను ఇప్పుడు ఏడీఐఏకు విక్రయించింది.
మైండ్‌స్పేస్ రీట్‌కు 10 గ్రేడ్-ఏ కార్యాలయ ఆస్తులున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4 ఆఫీస్ మార్కెట్లలోని ఈ ఆస్తుల్లో 31 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉన్నది. ఇందులో 85 శాతం లీజుకు ఇచ్చారు. దేశంలోని వివిధ రంగాల్లో బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్నాయి. ఈ సంస్థాగత మదుపరి నిర్వహణలో 60 బిలియన్ డాలర్ల ఆస్తులున్నట్టు అంచనా. రియల్ ఎస్టేట్‌లోనే 20 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద ఆఫీస్, రిటైల్ ఆస్తుల యజమానిగా వెలుగొందుతున్నది. 135 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, 16 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్పేస్, 40 మిలియన్ చదరపు అడుగుల లాజిస్టిక్స్ స్పేస్ బ్లాక్‌స్టోన్ అధీనంలో ఉన్నది.