టమాటాలు అనగానే.. ఎర్రగా బుర్రగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు నలుపు, ముదురు ఊదా రంగుల్లోని ‘బ్లాక్ చెర్రీ టమాటాలు’ మార్కెట్లోకి వస్తున్నాయి. చూసేందుకే కాదు.. రుచితోపాటు ఆరోగ్యప్రయోజనాల్లోనూ ఇవి ఎంతో ప్రత్యేకమని నిపుణులు చెబుతున్నారు. ఈ నల్లటి టమాటాల్లో దాగి ఉన్న ‘సూపర్ పవర్స్’ను వివరిస్తున్నారు.
బ్లాక్ చెర్రీ టమాటాల్లో ‘ఆంతోసైనిన్స్’ అనే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్లే వాటికి ఆ ముదురు రంగు వస్తుంది. ఈ ఆంతోసైనిన్స్.. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సాయపడతాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి. వీటిలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్.. కంటి చూపును మెరుగుపరుస్తాయి. రేచీకటి వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. అందుకే, డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపే నేటితరానికి ఈ టమాటాలు ఒక వరమనే చెప్పాలి.
ఇందులో అధిక మొత్తంలో లభించే లైకోపీన్, పొటాషియం.. గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఇక ఇందులోని పొటాషియం.. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. నల్ల టమాటాల్లోని విటమిన్ సి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. బ్లాక్ చెర్రీ టమాటాల్లో పీచు పదార్థం ఎక్కువ. కాబట్టి, జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకంతో బాధపడేవారికి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇక ఇందులో కేలరీలు చాలా తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు.