ఘజియాబాద్, నవంబర్ 1: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రానికి ఈ నెల 26 వరకు గడువు ఉందని, మరుసటి రోజు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను ఉద్ధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రి, ఘాజీపూర్‌లో రైతుల ఆందోళనకు నవంబర్ 26తో ఏడాది పూర్తవుతుంది. ఆందోళనకు దాదాపు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకత్వం వహిస్తున్నది. నవంబర్ 27 నుంచి గ్రామాల నుంచి రైతులు ట్రాక్టర్లపై ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని టికాయిత్ తెలిపారు.