వేడుకున్నా పట్టించుకోలే.. ఈసారీ పైసా కూడా విదల్చలే
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తన పక్షపాత ధోరణిని బయటపెట్టుకున్నది. ఎప్పటిలాగే ఈ సారి బడ్జెట్లోనూ రాష్ర్టానికి చెందిన ప్రాజెక్టులకు ఒక్కపైసాను కూడా కేటాంచకుండా వివక్షను చూపింది. రాజకీయ ప్రయోజనాలే ప్రధాన ఎజెండాని బీజేపీ సర్కారు మరోసారి చాటుకుంది. అందుకు నిధుల కేటాయింపే నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణతో పాటు, తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి మెదక్, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ.1.15 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇండస్ట్రియల్ అవసరాలకు 16 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 40 టీఎంసీలు అందించనుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఇది ప్రఖ్యాతి పొందించింది.
ప్రాజెక్టును చేపట్టిన నాటి నుంచి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు పంపుతూనే ఉన్నది. కనీసం రూ.20 వేల కోట్లను ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అనేకమార్లు స్వయంగా విన్నవించారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పైసా విదల్చలేదు. అదేవిధంగా 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు, పూర్తిగా కరువు ప్రాంతమైన మహబూబ్నగర్, ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీటిని అందిచేందుకు రూ.38,500 కోట్లతో చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికైనా జాతీయ హోదా ఇవ్వాలని, ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ సర్కారు కోరుతూ వస్తున్నది. కానీ అందుకూ కేంద్రం నిరాకరిస్తూ వస్తున్నది. అంతకన్నా తక్కువ ప్రయోజనాలు, వినియోగాలు ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తున్నది.