Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఓ రవాణా శాఖ అధికారిని బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఈ విషాద ఘటన గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పరకాల-భూపాలపల్లి హైవేపై జరిగింది. విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా, వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ లారీ వెంకన్నను ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు వెంకన్న మృతదేహం నుజ్జునుజ్జయ్యింది.
కాగా వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.