Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ హ్యాపీ మూడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు, సమంత తల్లి కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాతృత్వంపై సమంత చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్గా మారాయి. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాతృత్వం గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడింది. తల్లిగా మారడం తన జీవితంలో అత్యంత అందమైన, ప్రత్యేకమైన అనుభవంగా భావిస్తానని ఆమె తెలిపింది.
నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగే మహిళలంటే నాకు ఎంతో గౌరవం అని సమంత పేర్కొంది. తన చిన్ననాటి జీవితం అంత సులభంగా సాగలేదని సమంత తెలిపింది. తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పెరిగానని, అందుకే భవిష్యత్తులో తన పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా ప్రేమ, ఆప్యాయతలు, సౌకర్యవంతమైన జీవితం అందించాలని కోరుకుంటానని చెప్పింది.చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వారు తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకుంటాను అని సమంత వెల్లడించింది.
తల్లి అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పూర్తిగా పిల్లల పెంపకానికే సమయం కేటాయించాలని తాను భావిస్తున్నట్లు సమంత తెలిపింది. నాకు బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. నా బిడ్డే నా సర్వస్వంగా మారిపోతాడు లేదా మారిపోతుంది. కెరీర్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను అని ఆమె అప్పట్లో చెప్పింది.ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ వేడుకల్లో సమంత కనిపించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొన్ని ఫొటోలు, వీడియోల ఆధారంగా ఆమె తల్లి కాబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సమంత నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా ఆమె స్పందించలేదు.సమంత గతంలో మాతృత్వంపై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.