‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా ‘లెనిన్’ చిత్రంతో కెరీర్లో మొదటి హిట్‌ను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తాను పనిచేసిన హీరోల్లో ‘ఫ్రెండ్ షిప్, డేటింగ్, మ్యారేజ్’ ఎవరితో చేస్తారని యాంకర్ అడగ్గా.. ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నది.
అఖిల్ అకినేని తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పిన భాగ్యశ్రీ, డేటింగ్, పెళ్లి విషయానికి వచ్చేసరికి రామ్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ తెగ సిగ్గుపడిపోయింది. ‘నేను కలిసి నటించిన కో-స్టార్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.. అతను ఒకడే ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాడు’ అంటూ నవ్వుతూ హింట్ ఇచ్చింది.
దులర్ సల్మాన్, రవితేజ, అఖిల్ వంటి స్టార్స్ సరసన నటించిన భాగ్యశ్రీ, వారిలో పెళ్లి కాని ఏకైక హీరో రామ్ పోతినేని మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పడంతో ఆమె మనసులో ఉన్నది రామేనని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. గత కొంతకాలంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేల మధ్య ఏదో నడుస్తున్నదంటూ సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతున్నది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచే ఈ రూమర్స్ ఊపందుకున్నాయి.
ఈ సుందరి కోసమే రామ్ ఏకంగా లిరిసిస్ట్‌గా కూడా మారాడనే టాక్ ఇండస్ట్రీలో నడిచింది. గతంలో ఈ వార్తలను రామ్ ఖండించినప్పటికీ, భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. పైగా ‘లెనిన్’ ప్రమోషన్స్ సమయంలో ‘హైదరాబాద్ నా రెండో ఇల్లు.. ఆల్రెడీ ఉంది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.