సూపర్ సుబ్బు
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: సందీప్ కిషన్, మురళీ శర్మ, మానస చౌదరి, మిథిలా పార్కర్, గెటప్ శ్రీను తదితరులు..
దర్శకత్వం: మల్లిక్ రామ్
వినోదాత్మక కథలకు టాలీవుడ్ పెట్టింది పేరు. ఇక్కడ రూపొందిన ఎన్నో కామెడీ చిత్రాలు.. వెండితెరపై సందడి చేశాయి. బాక్సాఫీస్‌తోపాటు సరికొత్త రికార్డులనూ కొల్లగొట్టాయి. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా అదే బాటలో నడుస్తూ.. బుల్లితెరపైనా వినోదాన్ని పంచుతున్నాయి. ‘సెక్స్ ఎడ్యుకేషన్’ నేపథ్యానికి కామెడీని రంగరించి రూపొందిన తెలుగు వెబ్ సిరీస్.. సూపర్ సుబ్బు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రేక్షకుల మోముల్లో నవ్వులు పూయిస్తూ.. రికార్డ్ స్ట్రీమింగ్ నమోదు చేస్తున్నది.
కథలోకి వెళ్తే.. కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అవుతాడు. అతని కొడుకే మన హీరో.. సుబ్బు (సందీప్ కిషన్). కుక్కుటేశ్వర్ దృష్టిలో ఆ కొడుకో పనికి రానివాడు. అప్రయోజకుడు. తన రికమండేషన్‌తోనే సుబ్బును ఓ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో పెట్టిస్తాడు. ఆ జాబ్ కూడా సరిగ్గా చేయడం చేతకాదని కొడుకును ఎగతాళి చేస్తుంటాడు. ఇక సుబ్బుకు దివ్య (మానస చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు కుక్కుటేశ్వరరావు. అయితే, ఉద్యోగం పర్మినెంట్ అయితేనే పెళ్లి చేస్తానని షరతుపెడతాడు. ఇలా ఉండగా, ఒకరోజు సుబ్బు పనిచేసే స్కూల్‌కు డీఈవో చెకింగ్‌కు వస్తాడు.
తెలియక చేసిన ఓ తప్పు వల్ల సుబ్బు ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. దాంతో, తండ్రి తిట్ల నుంచి తప్పించుకోవడానికి, ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకునేందుకు.. స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పిన పని చేస్తానని చెబుతాడు సుబ్బు. ఈ క్రమంలోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఓ పల్లెటూరికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. మరి.. ఉద్యోగం, పెళ్లి కోసం కుగ్రామానికి వెళ్లిన సుబ్బుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శృంగారం పేరు ఎత్తితేనే కోపంతో ఊగిపోయే ఆ ఊరి ప్రజల వల్ల సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? నిరక్షరాస్యులైన పల్లెవాసులకు సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు ఎలా చెబుతాడు? అదే ఊరిలో పరిచయమైన స్వాతి (మిథిలా పార్కర్) వల్ల సుబ్బు జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? కొడుకు ఉద్యోగం గురించి కుక్కుటేశ్వరరావుకు తెలిసిందా? అసలు సాదాసీదా సుబ్బు నుంచి.. సుబ్బు సార్, సూపర్ సుబ్బు అనేవరకు అతని ప్రయాణం ఎలా సాగింది? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.