ఎడపల్లి/నవీపేట, మే 30: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎడపల్లిలో ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు పీఎఫ్ కట్ఆఫ్ డేట్ తొలగించి అర్హలందరికీ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో శంకర్‌నాయక్‌కు అందజేశారు.
కార్యక్రమంలో కాలేరు గంగాధర్, భాగ్య గంగా, లక్ష్మి, సుజాత, రమ, సునంద, బీడీ కార్మికులు పాల్గొన్నారు. నవీపేట పంచాయతీ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జిల్లా అధ్యక్షుడు డి.రాజేశ్వర్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డి.రాజేశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీడీ కార్మికులకు ప్రతి నెలా రూ.2,016 జీవన భృతి అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచలేదని పేర్కొన్నారు. బీడీ కార్మికుల పింఛన్ రూ. నాలుగువేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఉప సర్పంచ్ నవీన్‌రాజ్, సిబ్బంది చింతల రమేశ్‌కు అందజేశారు.