హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం గురు, శుక్రవారాల్లో సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించారు. సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ.. బ్యాంకులను దొంగల చేతిలో పెట్టడం దుర్మార్గమని విమర్శించారు.
రైతు ఉద్యమ స్ఫూర్తితో..
బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనకి తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు. బ్యాంకులను రక్షించుకునే క్రమంలో రాజకీయ పోరాటానికైనా తాము సిద్ధమేనన్నారు. బ్యాంకులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని, అటువంటివారిని ఎందుకు జైల్లో పెట్టట్లేదని మోదీ సర్కారును నిలదీశారు. ప్రజా సొమ్మును కొందరు లీగల్‌గా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులకు బాకీపడ్డవారిలో మాజీ ఎంపీలు సుజనా చౌదరి, లగడపాటి రాజగోపాల్ లాంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. 13 కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వ బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అదానీ, అంబానీ చేతిలోకి బ్యాంకులు పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఆది నుంచీ బ్యాంకుల ధ్వంసమే..
బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ధ్వంసం చేయాలనే ప్రయత్నిస్తున్నదని, ఇలాంటి చర్యలు దేశానికి హానికరమని మండిపడ్డారు. బ్యాంకుల ప్రైవేటీకరణను టీఆర్ఎస్తోపాటు అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయన్నారు. తమ పోరాటానికి మద్దతుగా జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌ను కూడా హైదరాబాద్‌కు ఆహ్వానిస్తామన్నారు. బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే చార్జీలు, వడ్డీలు పెరుగుతాయని, లాభార్జనను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ కార్యకలాపాలను నిర్వహిస్తారన్నారు. దీంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుందని రాంబాబు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.