శిశువుల పెరుగుదల ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొద్దిరోజులు ఎక్కువగా, కొద్దిరోజులు తక్కువగా ఉంటుంది. జన్మించిన రెండుమూడు వారాలకు, ఆ తరువాత ఆరు వారాలకు, తిరిగి మూడు నెలలకు పెరుగుదల రేటు అధికం. ఈ సమయంలో శిశువులు పాలకోసం ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇది సహజం, తాత్కాలికం. కొన్నిసార్లు ఏడుపు నాలుగైదు రోజులపాటు కొన సాగుతుంది. దీంతో, తల్లిపాలు సరిపోవడం లేదన్న అపోహతో పైపాలు ప్రారంభిస్తారు. శిశువు రోజుకు ఆరేడు సార్లు మూత్రం పోస్తూ, కనీసం ఇరవై గ్రాముల బరువు పెరుగుతూ, పాలు తాగాక కనీసం రెండు గంటలు నిద్రపోతే.. తల్లిపాలు సరిపోయినట్టే.
తల్లి అలవాట్ల ప్రభావం పిల్లల ఏడుపు మీద ఉంటుంది. కన్నతల్లి మితిమీరి కాఫీ, టీ, పాలు తాగినా.. మసాలాలు తిన్నా, శిశువుకు కడుపునొప్పి, విరేచనాలు రావచ్చు. ఏదైనా ఆహారం బిడ్డకు సరిపడటం లేదనుకున్నప్పుడు ఆ తల్లి, వారం రోజులపాటు వాటిని తినడం ఆపేయాలి. తిరిగి ప్రారంభించినప్పుడు పరిస్థితి ఎలా ఉందో గమనించాలి. ఈ పద్ధతి చక్కని ఫలితాలను ఇస్తుంది. ఏడుపు మాన్పించడానికి రబ్బరు పీకలు వాడరాదు. దీనివల్ల బిడ్డ గాలిని మింగే అవకాశం ఎక్కువ. అందులోనూ కిందపడిన పీకను కడగకుండా నోట్లో పెడితే, దానికి అంటుకొన్న బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు కడుపులోకి వెళ్లి అతిసార వ్యాధికి దారి తీయవచ్చు. పీకలు వాడిన వారికి చెవిలో చీము రావడం కూడా ఎక్కువే.
ఒకసారి ఇది అలవాటైతే వ్యసనంగానూ మారిపోవచ్చు. మరచి పోవడమూ కష్టం. ఏడ్చిన ప్రతిసారీ నోట్లో పీక దూర్చడం వల్ల శిశువు అవసరాలను సరిగా గుర్తించలేం. వయసు పెరిగేకొద్దీ శిశువు తనంతట తాను సంతోషాన్ని సృష్టించుకుంటాడు. క్రమంగా ఏడుపు తగ్గించుకుంటాడు. కాలం గడుస్తున్న కొద్దీ కన్నవారికి కూడా పిల్లల పెంపకంలో అనుభవం వస్తుంది. శిశువుకు ఏ సమయంలో ఏం అవసరమో తెలుస్తుంది. దీంతో ఏడుపు ద్వారా తమ అవసరాలను వ్యక్తం చేయాల్సిన అవసరమూ తగ్గుతుంది. అవసరమైంది, అవసరమైనట్టు సమకూరుస్తూ ఉండటం వల్ల.. బిడ్డకు ఏడ్చి కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. అయినా ఏడుపు మాననప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
శబ్ద కాలుష్యం
సెల్‌ఫోన్ శబ్దాలు, కుక్కల అరుపులు, గ్రైండర్లు, వంట సామగ్రి చప్పుళ్లు పిల్లల నిద్రను భంగపరుస్తాయి. శిశువును మరీ మెత్తని సోఫాలు, పరుపులపై పడుకోబెట్టకూడదు. దుప్పటి ముఖంపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో దళసరి, ఎండా కాలంలో సన్నని దుప్పట్లు వాడాలి. వయసు పెరిగేకొద్దీ బట్టలను తన్ని తీసేస్తుంది శిశువు. ఈ వయసులో పాదాలను మూసి ఉంచే పైజమా లాంటివి వేయాలి. నిద్రించే గది మరీ వెచ్చగానూ, మరీ చల్లగానూ ఉండరాదు. శిశువు రెండుమూడు గంటలకోసారి తనంతట తాను నిద్రలేచి పాలు సరిగా తాగకపోతే, అలసిపోయినట్లు కనిపిస్తే.. వెంటనే డాక్టరును సంప్రదించాలి. నిద్ర విషయంలో సమయపాలన మంచిది. క్రమపద్ధతికి అలవాటు పడినవారే సరిగ్గా నిద్రపోతారు. పడుకొన్న తరువాత మంచంలో వేసే బదులు, నిద్రమత్తులో ఉన్నప్పుడే వేసి జోకొట్టాలి. దీనివల్ల శిశువు తనంతటతాను నిద్రపోవడం నేర్చుకుంటుంది.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు