Avika Gor | పెళ్లి తర్వాత తమ తొలి వాలెంటైన్స్ డేను నటి అవికా గోర్, ఆమె భర్త మిలింద్ చంద్వానా ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరుపుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఇది మొదటి ప్రేమికుల దినోత్సవం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఖరీదైన వేడుకలు, హంగామాలకంటే తమ బంధాన్ని మరింత గాఢంగా అనుభవించడం, కలిసి గడిపే సమయానికే ప్రాధాన్యం ఇస్తున్నామని అవికా తెలిపింది. “ఇది కేవలం ఒక రోజు కాదు… మేము కలిసి నిర్మించుకుంటున్న మా చిన్న ప్రపంచాన్ని గౌరవించుకునే సందర్భం” అని ఆమె భావోద్వేగంగా పేర్కొంది.
వాలెంటైన్స్ డే అంటే బహుమతులు, డైమండ్ రింగులు కాదని… ఒక ప్రాణాన్ని కాపాడటమే తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ఈ జంట చెబుతోంది. ఇటీవల షూటింగ్ సమయంలో వీధి కుక్కల బారి నుంచి ఒక చిన్న పిల్లిని కాపాడి ‘షిరీ’ అని పేరు పెట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చారు. సంప్రదాయ గిఫ్టులకంటే ఈ నిర్ణయమే తమ ఆలోచనలూ, విలువలూ ఒకటేనని చెప్పే నిదర్శనమని అవికా పేర్కొంది. రొమాన్స్ అంటే గొప్ప సెట్టింగ్స్ కాదు, కష్టకాలాల్లో ఒకరికొకరు అండగా నిలబడటం, కలిసి నవ్వుకోవడం, చేతులు పట్టుకుని నడవాలని అనిపించడమే అసలైన ప్రేమ అని ఆమె అభిప్రాయపడింది.
పెళ్లి తర్వాత వచ్చిన ప్రశాంతత తమ బంధాన్ని మరింత బలపరచిందని చెప్పిన ఈ జంట ఇటీవల పతి పత్ని ఔర్ పంగా రియాలిటీ షోలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక అవికా గోర్ విషయానికి వస్తే ఈ అమ్మడు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో ఎంతగానో అలరిస్తూ ఉంటుంది.