హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తో భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ( Philip Green ) ఫిలిప్ గ్రీన్ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ ( Hilary McGeachy ) హిల్లరీ మెక్‌గీచీ భేటీ అయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు , వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. గతంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కేటీఆర్ ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.
తెలంగాణ ,ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఇరువురు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ , ఆస్ట్రేలియా మధ్య ఉన్న దృఢమైన మైత్రిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఈ చర్చలు కొనసాగాయి. ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన ఈ భేటీ పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, సాంస్కృతిక బంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన అన్నారు.