బ్రిస్బేన్: సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ విజృంభించడంతో మూడో రోజు మొండిగా పోరాడిన ఇంగ్లండ్ జట్టు.. నాలుగో రోజు నిలువలేకపోయింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 220/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 297 పరుగులకే ఆలౌటైంది. మూడో రోజు గొప్పగా పోరాడిన రూట్ (89), మలన్ (82) వెంటవెంటనే ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన వారు కనీస పోరాటం కనబర్చలేదు. బెన్ స్టోక్స్ (14), ఒలీ పోప్ (4), బట్లర్ (23), వోక్స్ (16) పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో ఇంగ్లిష్ జట్టు కంగారూలకు 20 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆసీస్ బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, గ్రీన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 5.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. బదులుగా ఆస్ట్రేలియా 425 పరుగులు చేసింది. ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు (డే అండ్ నైట్) ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌కు భారీ దెబ్బ
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు.. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలై నిరాశలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. బ్రిస్బేన్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడ్డందుకు ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 100 శాతం కోత విధించిన ఐసీసీ.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీ సీ) నుంచి ఐదు పాయింట్లు తగ్గించింది. నిర్ణీత సమయంలో ఐదు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసు కున్నాడు. ఐసీసీ డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోతే అన్ని పాయింట్లు ఖాతాలో నుంచి తొలగిస్తారు. 2023 డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పటికే ఏడు పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. ప్రస్తుతం 9 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
ఆఖరి టెస్టు హోబర్ట్‌లో..
యాషెస్ సిరీస్‌లో చివరి టెస్టును హోబర్ట్ వేదికగా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. జనవరి 14న ప్రారంభం కానున్న ఆఖరి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం పెర్త్‌లో జరుగాల్సి ఉన్నా.. కరోనా వైరస్ నేపథ్యంలో కఠిన క్వారంటైన్ నిబంధనలు విధించడంతో వేదికను హోబర్ట్‌కు మార్చింది. దీంతో పాటు ఆ మ్యాచ్‌ను ‘పింక్’ బంతితో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే అండ్ నైట్‌గా నిర్వహించనున్నట్లు పేర్కొంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 147, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 425, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 297 ( రూట్ 89, మలన్ 82; లియాన్ 4/91), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 5.1 ఓవర్లలో 20/1.