హైదరాబాద్, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ): అడిగినవారిని అదిలించటం.. ప్రశ్నించినవారిని బెదిరించటం.. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధించటం.. నాడూ.. నేడూ.. ఏనాడైనా ఇదే బీజేపీ నైజం. ఎదురు తిరిగేవాళ్లను లొంగదీసుకొనేందుకు ఆ పార్టీ, ప్రభుత్వం ఎంతటి అధికార దుర్వినియోగానికైనా వెనుకాడదని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా మరోసారి ఆ పార్టీ అదే దుర్బుద్ధిని బయటపెట్టుకొన్నది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పట్ల నీచంగా ప్రవర్తించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను విమర్శించినందుకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావుపై అస్సాంలో కేసులు నమోదుచేశారు. పాకిస్థాన్‌లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించటంపై రాహుల్‌గాంధీ ఆధారాలు అడిగినందుకు రాహుల్ ఏ తండ్రికి పుట్టారో అడిగామా అంటూ అస్సాం సీఎం దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడిన సీఎం కేసీఆర్ తాను కూడా అదే ప్రశ్న అడుగుతున్నానని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అనునిత్యం దేశాన్ని రక్షిస్తున్న సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా అని స్పష్టంచేశారు. అయితే, బీజేపీ మాత్రం అననివి అన్నట్టుగా, లేనివి ఉన్నట్టుగా తప్పుడు ప్రచారానికి దిగింది. సైన్యాన్ని అవమాన పర్చారంటూ కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నిస్తున్నది. హిమంత వ్యాఖ్యల నష్టాన్ని పూడ్చుకొనేందుకే కేసీఆర్‌పై బీజేపీ కేసులు పెడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
అస్సాం ముఖ్యమంత్రిపై రాష్ట్రంలో కేసు
హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఒకే కేసు నమోదవుతుందని మంగళవారం హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. మహారాష్ట్రలో ఈ ఫిర్యాదులపై కేసు నమోదైనట్టు తెలిసిందని, అక్కడ కేసు నమోదైతే, ఈ ఫిర్యాదులు అక్కడకు పంపిస్తామని వెల్లడించారు. అక్కడ కేసు నమోదు కాకుంటే జూబ్లీహిల్స్‌లో కేసు నమోదుచేసి, రాష్ట్ర ఫిర్యాదులను జత చేస్తామని వివరించారు.