Badam Milk : ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంటే జనం భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే.. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాంటప్పుడు ఏదైనా చల్లగా తాగితే బాగుండు అనిపిస్తుంది. అలాగని కిరాణా దుకాణాలు, బేకరీలు, స్వీట్ షాప్‌లలో దొరికే ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి గండిపడుతుంది. కాబట్టి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే సహజమైన జ్యూస్‌లను ఇంట్లోనే చేసుకుని తాగడం బెటర్. బాదాం మిల్క్‌ను కూడా ఇంట్లోనే చల్లచల్లగా తయారు చేసుకోవచ్చు. ఆ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం..
బాదంపప్పులు – 1 కప్పు
జీడిపప్పు – 1 కప్పు
చక్కెర – 100 గ్రాములు
యాలకుల పొడి – 1/2స్పూన్
పాలు – 1/2 లీటర్
ముందుగా బాదాంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకుని మరో గిన్నెలో వెన్న తీయని పాలను మరిగించుకోవాలి. మరిగిన పాలలో యాలకుల పొడి, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందే పొడిచేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు మిశ్రమాన్ని పాలల్లో కలుపాలి. ఆపై చిన్న మంట మీద 10 నిమిషాలపాటు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
ఆ తర్వాత ఈ బాదాం పాలను గ్లాసుల్లో పోసి, పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పులు చల్లుకుని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంతే.. చల్లచల్లటి బాదాం పాలు రెడీ. రోజూ ఇలా బాదం మిల్క్ చేసి పిల్లలకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారు. బయట లభ్యమయ్యే రసాయన మిశ్రమాలతో కూడిన డ్రింక్స్ కంటే ఇంట్లో చేసుకునే ఇలాంటి డ్రింక్స్ చాలా మంచివి.
బాదాం పాలలోని బాదాం, జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలోనూ తోడ్పడుతాయి. బాదంపప్పు రోజూ తింటే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇందులోని పాలు శరీరానికి కాల్షియంను అందిస్తాయి. ఇది పిల్లలకు శక్తినిచ్చి ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది. బాదం, జీడిపప్పు, పాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.