హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఎస్టీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. కీలక సబ్జెక్టు టీచర్లను హాస్టల్ వార్డెన్లుగా నియమిస్తూ.. వారిస్థానంలో మళ్లీ కొత్తగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తున్న దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 29 మినీగురుకులాలు నిర్వహిస్తున్నది. కేవలం గిరిజన బాలికల కోసమే వాటి ని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నది. దాదాపు 21మినీ గురుకులాల్లో హెడ్ మిస్ట్రెస్ కమ్ వార్డెన్లు లేరు. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ వాటి నియామకంపై దృష్టి పెట్టలేదు. ఇదే అదనుగా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
నచ్చినవాళ్లకు, పైరవీలు చేసినవాళ్లకు మినీ గురుకులాల్లో డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. సొసైటీలో పనిచేసే టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్), పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లకు మినీగురుకులాల్లో డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. 17మందిని ఇప్పటికే ఇష్టారీతిన డిప్యుటేషన్లు కల్పించారు. వివిధ గురుకులాల్లోని కీలక సబ్జెక్టు టీచర్లకు వార్డెన్లుగా డిప్యుటేషన్ కల్పించడం సొసైటీలో చర్చనీయాంశంగా మారిం ది.
సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న, సొంత జిల్లాలకు చెందిన వారినే వారి సమీప ప్రాంతాలకు డిప్యుటేషన్ కల్పించడం గమనార్హం. మరోవైపు డిప్యుటేషన్‌పై వెళ్లిన టీచర్ల స్థానంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ ఆయా గురుకులాల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన సబ్జెక్టుల్లో వెనుకబడిపోతున్నారని స్వతహాగా ఆయా గురుకులాల టీచర్లే వెల్లడిస్తున్నారు. కీలక సబ్జెక్టు టీచర్లను వార్డెన్లుగా పంపడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.